కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లపై ప్రతిపాదనలు ఇవ్వండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:08 AM
కాళేశ్వరం బ్యారేజీల పున రుద్ధరణ డిజైన్లపై రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని ఆఫ్రీ ఇండియా (ముంబై) సంస్థను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
ఆఫ్రీ ఇండియా ప్రతినిధులను కోరిన నీటిపారుదలశాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల పున రుద్ధరణ డిజైన్లపై రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని ఆఫ్రీ ఇండియా (ముంబై) సంస్థను తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్‌లోని జలసౌధలో బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లపై ఆఫ్రీ ఇండియా ప్రతినిధులతో నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ (జనరల్) రమేశ్‌బాబు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ ఎం.సత్యనారాయణరెడ్డి, నీటిపారుదలశాఖ సంయుక్త కార్యదర్శి జె.శ్రీనివా్‌సతో పాటు ఆఫ్రీ ఇండియా ప్రతినిధి సాయికృష్ణ, హైడ్రాలజీ ఎస్‌ఈ వెంకటరమణలు హాజరయ్యారు. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌ల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై రోడ్‌మ్యా్‌పను, కార్యాచరణ ప్రణాళికను అందించాలని అధికారులు కోరారు. వారం రోజుల్లోగా ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీన కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆఫ్రీ ఇండియా తెలిపింది. పునరుద్ధరణ డిజైన్ల కోసం ఏయే పరీక్షలు అత్యవసరమనే దానిపై నిర్ణయం తీసుకొని, ముందుకెళతామని స్పష్టం చేసింది.