2028 నాటికి కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:48 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు.
రిపేర్ పనుల కోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా స్టీరింగ్ కమిటీ
వారంలోగా కొత్త డిజైన్లు.. వాటినసీడబ్ల్యూసీకి పంపాలి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. పనులు వేగంగా పూర్తిచేసేందుకు నీటిపారుదల రంగ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ఆదివారం సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028 నాటికి బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్టీరింగ్ కమిటీ వారానికి రెండుసార్లు సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తుందని తెలిపారు. అవసరమైతే తాను కూడా సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. ఈ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఏన్డీఎ్‌సఏ, విజిలెన్స్ సంస్థలు గుర్తించాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ సమస్యలను అధిగమించి ప్రాజెక్టును తిరిగి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 2027, 2028 సంవత్సరాలను బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో అత్యంత కీలకంగా పరిగణించాలని అధికారులకు సూచించారు. బ్యారేజీల కొత్త డిజైన్ల రూపకల్పన బాధ్యతను ఏఎ్‌ఫఆర్‌వై ఇండియా, ఐఐటీ బాంబేలకు అప్పగించినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా డిజైన్లు సిద్ధం చేసి సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీల వద్ద భూభౌతిక పరీక్షలను పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర జల సంఘంతో సమన్వయం చేసుకొని అవసరమైన అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌కు సూచించారు. ఎల్‌అండ్‌టీ సహా నిర్మాణ సంస్థలు బ్యారేజీల వద్ద తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని చెప్పారు. డిజైనర్లు, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు.