Share News

అవమానభారం, వేధింపులతో రాలిపోయిన విద్యా కుసుమం

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:46 AM

అనుమాన భారం, మానసిక వేధింపులు నిండుప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నిందలను భరించలేక కుమిలిపోయిన ఓ విద్యా కుసమం రాలిపోయింది.

అవమానభారం, వేధింపులతో రాలిపోయిన విద్యా కుసుమం

  • కేయూ విద్యార్థిని బలవన్మరణం

  • ల్యాప్‌టాప్‌ చోరీ చేసిందంటూ హాస్టల్‌ రూమ్‌మేట్స్‌ ఆరోపణలు

  • పోలీసులకు ఫిర్యాదుతో తనిఖీలు

  • మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం

  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

  • వర్సిటీలో విచారణకు కమిటీ ఏర్పాటు

  • ఆరుగురు సీనియర్‌ విద్యార్థినులపై పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు

కేయూ క్యాంప్‌స/ఎర్రుపాలెం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): అనుమాన భారం, మానసిక వేధింపులు నిండుప్రాణాన్ని బలి తీసుకున్నాయి. నిందలను భరించలేక కుమిలిపోయిన ఓ విద్యా కుసమం రాలిపోయింది. కాకతీయ యూనివర్సిటీ క్యాంప్‌సలో ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్‌ ఎంఎస్సీ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న పెదమళ్ల శ్రీవిద్య (19) విషాదాంతమిది. కేయూలో జరిగిన ఓ ఘటన, తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పెదమళ్ల కృష్ణబాబు, అంజమ్మ దంపతుల కుమార్తె శ్రీవిద్య. కేయూ క్యాంప్‌సలోని మహిళా హాస్టల్‌లో ఉంటున్న ఆమె.. ఈ నెల 2న తమ ల్యాప్‌టా్‌పను దొంగలించిందంటూ ఆమె సీనియర్లయిన రూమ్‌మేట్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రూమ్‌లో తనిఖీలు చేసిన పోలీసులు.. శ్రీవిద్యతోపాటు విద్యార్థినులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. అయినా శ్రీవిద్య చోరీ చేసిందంటూ దుష్ప్రచారం చేశారు. హాస్టల్‌ రూమ్‌లో ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయాలపై శ్రీవిద్య రోదిస్తూ చెబుతున్న వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మొదట బట్టల దొంగతనం మోపడం, తర్వాత ల్యాప్‌టాప్‌ తీసిందని పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కించడంతో శ్రీవిద్య మానసిక వేదనకు గురైంది. శ్రీవిద్య ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పగా, వారు వచ్చి హాస్టల్‌ అధికారులు, పోలీసులతో మాట్లాడి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా దుందిరాలపాడులోని తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఈ కమ్రంలో 7న ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మధిరలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె తుదిశ్వాస విడిచింది. కాగా, చికిత్స పొందే క్రమంలో తన చావుకు కారణం సీనియర్లేనని చెప్పగా.. ఆమె తల్లి తన ఫోన్‌లో వీడియో తీశారు. దాని ఆధారంగా ఆరుగురు సీనియర్‌ విద్యార్థులపై మధిర టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా.. కేసు నమో దైంది. కాగా, శ్రీవిద్య మృతికి వర్సిటీ హాస్టల్‌ అధికారుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఖరే కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నేతలు సోమవారం కేయూ పరిపాలన భవనం ఎదుట వారు బైఠాయించారు. వీసీ కే ప్రతా్‌పరెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రంను అడ్డుకున్నారు. దీంతో దిగివచ్చిన వర్సిటీ అధికారులు.. ఘటనపై విచారణకు ఓ కమిటీని వేశారు.

Updated Date - Mar 18 , 2026 | 05:46 AM