కేఎంసీలో ర్యాగింగ్..
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:24 AM
హనుమకొండ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది.
ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై చర్యలు
ఆరు నెలల పాటు తరగతుల నుంచి బహిష్కరణ
కోర్సు పూర్తయ్యే దాకా హాస్టల్‌లోకి అనుమతి నిరాకరణ
రేడియాలజీ విద్యార్థుల ర్యాగింగ్‌పై కొనసాగుతున్న విచారణ
వరంగల్ మెడికల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)లో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులను ఆరునెలల పాటు తరగతులకు హాజరుకాకుండా బహిష్కరించింది. అలాగే, కోర్సు పూర్తయ్యే వరకు కళాశాల హాస్టల్‌లో ప్రవేశించడంపై నిషేధం విధించింది. కేఎంసీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ విద్యార్థులను ఉద్దేశించి సెకండియర్ విద్యార్థులు కొందరు వాట్సాప్ లో మాట్లాడుకోవడం ర్యాగింగ్‌కు కారణమని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులు 20 మంది జూనియర్లను బుధవారం హాస్టల్ భవనంపైకి పిలిచి వారితో గోడకుర్చీ వేయించి, క్షమాపణలు చెప్పించుకున్నారు. దీనిపై జూనియర్ మెడికోలు కొందరు పోలీసు కమిషనర్ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వరకు ఫిర్యాదులు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన గురువారం సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠినచర్యలు తీసుకుంది. ఘటనపై మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోపక్క, కేఎంసీలో బీఎస్సీ రేడియాలజీ విభాగంలోనూ ర్యాగింగ్ ఘటన బయటకొచ్చింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థిని వరంగల్ మ్యూజికల్ గార్డెన్‌కు పిలిపించి తమకు మర్యాద ఇవ్వడం లేదంటూ భౌతిక దాడికి దిగారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ప్రిన్సిపాల్ సంధ్య దృష్టికి రాగా అంతర్గత విచారణకు ఆదేశించారు. బాధ్యులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.