Share News

కేఎంసీకి పూర్వ విద్యార్థుల వితరణ రూ.10 కోట్లు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:59 AM

కాకతీయ మెడికల్‌ కళాశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు రూ.10 కోట్లు వితరణగా ఇచ్చారు. కేఎంసీలో మెడిసిన్‌ పూర్తి చేసిన సుజిత్‌రెడ్డి..

కేఎంసీకి  పూర్వ విద్యార్థుల వితరణ రూ.10 కోట్లు

హనుమకొండ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : కాకతీయ మెడికల్‌ కళాశాల అభివృద్ధికి పలువురు పూర్వ విద్యార్థులు రూ.10 కోట్లు వితరణగా ఇచ్చారు. కేఎంసీలో మెడిసిన్‌ పూర్తి చేసిన సుజిత్‌రెడ్డి.. తమ బృందం ప్రతినిధిగా ఈ రూ.10 కోట్ల నిధులు సమీకరించి, వరంగల్‌కు వచ్చి అందజేశారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుజిత్‌రెడ్డి అందజేసిన నిధులతో కేఎంసీ భవనాల మరమ్మతులు, ప్రహరీ, ఇతర మరమ్మతు పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సుజిత్‌రెడ్డి మాట్లాడుతూ తన స్వస్థలం హనుమకొండలోని అడకేట్స్‌ కాలనీ అని, 1988-94లో కేఎంసీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసినట్టు తెలిపారు. తనను వైద్యుడిగా తీర్చిదిద్దిన కేఎంసీ రుణం తీర్చుకునేందుకు నిధుల వితరణ బాధ్యతగా భావించానని, ఇందుకు మిగతా మిత్రులందరూ సహకరించారని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో పెయిన్‌ క్లినిక్‌ ఏర్పాటుకు అవసరమైన వనరుల కల్పనకు ప్రణాళికతో ఉన్నట్లు చెప్పారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ పున్నం సుజిత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

Updated Date - Feb 25 , 2026 | 01:59 AM