మనుషులను కలిపేది కరుణ శక్తే
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:03 AM
మనుషులను కరుణరసం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంచుతుందని, అత్యంత ప్రభావితం చేసే ఒక మహత్తర శక్తి కరుణ రసం సొంతమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ సిటీ, జనవరి24(ఆంధ్రజ్యోతి): మనుషులను కరుణరసం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంచుతుందని, అత్యంత ప్రభావితం చేసే ఒక మహత్తర శక్తి కరుణ రసం సొంతమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. హైటెక్‌సిటీలోని సత్వా నాలెడ్జ్ సిటీ వేదికగా 16వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి రాసిన ‘కరుణ- ది పవర్ ఆఫ్ కంపాషన్’ పుస్తకంపై గవర్నర్ మాట్లాడుతూ కరుణ ప్రాధాన్యతను వివరించారు. హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేయడంలో హైదరాబాద్ సాహితీ మహోత్సవం ప్రము ఖ పాత్ర పోషిస్తోందని కొనియాడారు. కళాకారులు, రచయితలు, పాఠకులు, బుద్ధి జీవులు, ఆలోచనాపరులను ఒకే వేదికమీదకు ఇలా తీసుకురావడం బృహత్ కార్యక్రమంగా అభివర్ణించారు. సాహిత్యం సరిహద్దులను చెరిపేస్తుందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి చెప్పారు. కుల,మత, ప్రాంత, భాషా, సంస్కృతుల గోడలను దాటి మనల్ని ఏకం చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సంక్షోభాలకు నెలవైందని, నిత్య సమస్యలు, ఉదాసీనత, నిర్లక్ష్యభావం సాధారణ విషయాలుగా మారాయన్నారు. ఈ ఉదాసీన పరిస్థితులే తనను ‘‘కరుణ- ది పవర్ ఆఫ్ కంపాషన్’ పుస్తకం రాయడానికి పురిగొల్పాయని కైలాష్ సత్యార్థి చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హెచ్‌ఎల్‌ఎ్‌ఫ డైరెక్టర్లు ఉషా రామన్, విజయ్ కుమార్, అమితాదేశాయ్, కిన్నెర మూర్తి, తేజ బాలాంత్రపు, రంగస్థల, సినీ దర్శకుడు ఎంకే రైనా, రచయిత సిద్ధార్థ గిగూ తదితరులు పాల్గొన్నారు.