Share News

నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్లలేదు

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:36 AM

తాను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్లలేదని, పరిపాలనా నిబంధనలు తనకు తెలుసని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాను క్రమశిక్షణతో ఉంటానని..

నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్లలేదు

  • దేవాదాయశాఖపై సమీక్ష చేయలే

  • అధికారులకు విజ్ఞాపనలు ఇచ్చా

  • ఇది ఎమ్మెల్యేగా నాకున్న హక్కు

  • పాలనా నిబంధనలు తెలుసు

  • మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్‌

స్టేషన్‌ ఘన్‌పూర్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): తాను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్లలేదని, పరిపాలనా నిబంధనలు తనకు తెలుసని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తాను క్రమశిక్షణతో ఉంటానని, ప్రోటోకాల్‌ను గౌరవిస్తానంటూ ఎలాంటి తప్పూ చేయనప్పుడు వివరణ ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. కడియం తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన బుధవారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. సర్పంచ్‌ నుంచి ఎంపీ వరకు వారి పరిధిలోని గ్రామాలు, నియోజకవర్గాలు, ప్రజల సమస్యలపై అధికారులు, మంత్రులు, సీఎంను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటారని తెలిపారు. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎలాంటి పరిధులు లేవని, వారు ఎవరి వద్దకైనా వెళ్లి వినతిపత్రాలు ఇవ్వవచ్చన్నారు. ప్రోటోకాల్‌కు లోబడి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి, మరమ్మతుల కోసం, ఆలయాలకు అర్చకులు, ఈవోలు లేరని చెప్పటానికే పలు ఆలయాల చైర్మన్లతో వెళ్లి రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పారు. మొత్తం శాఖపై తానెలా సమీక్ష చేస్తానని, తనకేం అధికారం ఉందన్నారు. అధికారులు తనకు వద్దకు వస్తే అప్పుడు తాను సమీక్ష చేసినట్లు భావించాలే తప్ప తాను వారి వద్దకు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినప్పుడు కాదని చెప్పారు. తాను సమీక్ష నిర్వహించాననడం అవగాహన లోపమేనన్నారు. తమకు తెలియకుండా తమ శాఖ అధికారుల దగ్గరకు వెళ్లొద్దని కొందరు అంటున్నారని, ఇలాంటిది తానెక్కడా వినలేదన్నారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ చేయడానికి చాలా పనులు ఉన్నాయని, వివార రాజకీయాలు, అనవసర విషయాల జోలికి వెళ్లి సమయం వృథా చేసుకోవద్దని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Updated Date - Jul 09 , 2026 | 05:37 AM