Share News

కేసీఆర్‌ ఎవరికి జాతిపిత?

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:13 AM

మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలపై సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ ఎవరికి జాతిపిత?

  • తెలంగాణ మీ అయ్య జాగీరా..?

  • ఇంకెన్నాళ్లు సెంటిమెంట్‌ రాజకీయాలు

  • కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలపై సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఒకాయన మాజీ సీఎం కేసీఆర్‌ను జాతిపిత అంటున్నాడు. ఎవరికి జాతిపిత.. దేశానికి జాతిపిత మహాత్మాగాంధీ మాత్రమే. కానీ గాంధీజీని అవమాన పరిచేలా వీడెవ్వడో కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని రావడం విడ్డూరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్‌ఎస్‌ నాయకులు మీకు మీరే కేసీఆర్‌ జాతిపిత అనుకుంటే సరిపోతుందా. ప్రజలు అంగీకరించాలి కదా. జాతిపిత ఎక్కడ ఉంటున్నాడు. ఎక్కడ పడుకుంటున్నాడు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అనేక అవకతవకలకు పాల్పడి కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి తెలంగాణ వనరులను దోచుకున్నారు. వేల ఎకరాల భూములు సొంతం చేసుకున్నారు. బ్రహ్మాండమైన ఫామ్‌ హౌస్‌లు, ప్యాలె్‌సలు నిర్మించుకున్నారు. వేల కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు చెమటోడ్చి సంపాదించారా’ అని నిలదీశారు. ‘ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే 2014కి ముందు, 2023లో సీఎం పదవి నుంచి కేసీఆర్‌ దిగిపోయే నాటికి కల్వకుంట్ల కుటుంబానికి గల ఆస్తులు ఎన్ని’ అన్న వివరాలను ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ నీ అయ్య సొత్తా.. నీ అయ్య జాగీరా.. అందరిదీ కాదా’ అని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 20 , 2026 | 02:13 AM