Share News

‘కడ్డితంత్రి’ కళాకారుడికి కేంద్ర పురస్కారం

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:29 AM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్య.. కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘కడ్డితంత్రి’ కళాకారుడికి కేంద్ర పురస్కారం

  • దురిశెట్టి రామయ్యకు సంగీత నాటక అకాడమీ అవార్డు

సుల్తానాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్య.. కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు గురువారం సమాచారం అందించారు. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి రామయ్య ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దురిశెట్టి రామయ్య పురాతన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటైన కడ్డితంత్రిని వాయిస్తూ దానికి అనుగుణంగా పాటలు పాడటంలో ప్రవీణుడు. ఆయన 1974 నుంచి ఈ కడ్డితంత్రి వాయిద్య కళను ప్రదర్శిస్తూ వస్తున్నారు. చిన్నతనంలోనే తన తండ్రి నుంచి నేర్చుకున్న ఈ కళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో కూడా ప్రదర్శించి పలు అవార్డులు, సన్మానాలు పొందారు. ఈ నెల 22 లేదా 26 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:29 AM