Share News

కాచిగూడ ఎస్సీ హాస్టల్‌కు బాబు జగ్జీవన్‌రామ్‌ పేరు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:23 AM

కాచిగూడ ఎస్సీ హాస్టల్‌ను రూ.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరించి.. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ పేరు పెడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.

కాచిగూడ ఎస్సీ హాస్టల్‌కు బాబు జగ్జీవన్‌రామ్‌ పేరు

  • 30 కోట్లతో ఆ వసతి గృహాన్ని పునరుద్ధరిస్తాం: అడ్లూరి

  • జయంతి సందర్భంగా మాజీ ఉప ప్రధానికి ఘన నివాళులు

హైదరాబాద్‌/బర్కత్‌పుర, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ ఎస్సీ హాస్టల్‌ను రూ.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరించి.. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ పేరు పెడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. బాబు జగ్జీవన్‌రామ్‌ 119వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి అధికార, విపక్ష నేతలతో పాటు పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ మల్లు రవి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతమ్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సభలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. దళిత బిడ్డలు ఉన్నత విద్యావంతులు కావాలన్నది సర్కారు ప్రధాన సంకల్పమని, అందుకే రూ.వంద కోట్లతో హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ టవర్‌ను నిర్మిస్తున్నామన్నారు. మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జగ్జీవన్‌రామ్‌ చరిత్ర చదవాలని, దళితుల హక్కుల కోసం పోరాడిన తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దళితులు ఐక్యంగా ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. దళిత వర్గాల అభివృద్ధికి ఎనలేని సేవలందించిన జగ్జీవన్‌రామ్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించి గౌరవించాలని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన యాడ్‌లో మంత్రి అడ్లూరి ఫొటో పేరు లేకపోవ డం దళితులను అవమానించడమేనన్నారు. దీనిపై అడ్లూరి స్పందిస్తూ.. ఆ యాడ్‌లో జరిగిన పొరపాటుపై సమాచార శాఖ విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు.


జగ్జీవన్‌ స్ఫూర్తితోనే పాలన: రేవంత్‌

కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా మాజీ ప్రధాని జగ్జీవన్‌రామ్‌ పోరాడారని, దళితుల హక్కుల కోసం జీవితాంతం పనిచేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటం వద్ద సీఎం నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితోనే తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటు.. గాంధీభవన్‌లోనూ జగ్జీవన్‌రామ్‌కు కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయాలు సాధిద్దాం: భట్టి

బాబు జగ్జీవన్‌రామ్‌ చూపిన మార్గంలో నడవడమే ఆ మహనీయుడికిచ్చే నిజమైన నివాళి అని.. ఆయన ఆశయాలను సాధిద్దామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో జగ్జీవన్‌రామ్‌ పాత్ర చిరస్మరణీయమన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న విధానపర నిర్ణయాలు ఈనాటికీ పాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.

Updated Date - Apr 06 , 2026 | 04:23 AM