మద్రాస్ హైకోర్టు తీర్పు విపక్షాలకు చెంపపెట్టు
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:20 AM
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రోత్సహించే పార్టీలకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు...
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్
హనుమకొండ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రోత్సహించే పార్టీలకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తూ 2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు ఇస్లాంలోకి మారితే వెనుకబడిన తరగతి ముస్లిం(బీసీఎం)లుగా వారిని పరిగణించలేమని, కేవలం ముస్లింలుగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. శుక్రవారం హనుమకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేతో సహా ప్రతిపక్ష పార్టీలు మతప్రాతిపదికన రిజర్వేషన్లతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించాయని విమర్శించారు. ఓట్ల కోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌లో సైతం ముస్లింలను బీసీల జాబితాలో ఇష్టారాజ్యంగా చేర్చారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12 శాతానికి పెంచిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. మొన్నటి వరకు తెలంగాణ సంపదను కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్మంతా మూటల రూపంలో కాంగ్రెస్‌కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.