వికసిత్ భారత్ దిశగా కేంద్ర బడ్జెట్: కె.లక్ష్మణ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:00 AM
కేంద్ర బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే మహోన్నత ప్రణాళిక అని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే మహోన్నత ప్రణాళిక అని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందన్నారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన టీవీ సీరియల్‌ను తలపిస్తోందని, ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం రేవంత్ నాటకాలాడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి భారీ కుంభకోణాలపై రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, తన వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే రేవంత్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని చెప్పారు.