పదేళ్లూ ప్రజల్లోకి పోలేదు... అందుకే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర: కవిత
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:32 AM
పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రజల్లోకి పోలేదు... అందుకే ఇప్పుడు వారిని చూసేందుకు పాదయాత్ర చేస్తా అంటున్నాడు...
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ‘పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రజల్లోకి పోలేదు... అందుకే ఇప్పుడు వారిని చూసేందుకు పాదయాత్ర చేస్తా అంటున్నాడు’ అనుకుంటన్న అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. తనకు ఏదైనా శని ఉంటే పోవడం కోసమే తాను వారణాసి వెళ్ళి పూజలు చేశానని తెలిపారు. తాను ప్రారంభించే పార్టీ విజయం సాధించాలని కోరుకున్నా అన్నారు. కొందరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారి పేర్లు వెల్లడించనని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టే బీఆర్‌ఎ్‌సను టార్గెట్ చేశానని, ఇప్పుడు అధికార పార్టీపై మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లును కలపడం వల్లే లోక్‌సభలో వీగిపోయిందని, ఈ అంశంలో మహిళలను బీజేపీ వంచించిందని కవిత మండిపడ్డారు. 2027 జనగణనలో ఓబీసీలను లెక్కించి, దాని ఆధారంగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తెచ్చిందన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఆడబిడ్డలు బీజేపీ మోసాన్ని గుర్తించాలన్నారు. ఈనెల 25వ తేదీ కొత్త పార్టీ ఆవిర్భావం రోజున ఆమె తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత ఆవిర్భావ సమావేశానికి బయల్దేరనున్నారు.