ట్రాన్స్‌జెండర్లూ జడ్జిలయ్యే రోజులు రావాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:19 AM
న్యాయవ్యవస్థ అంటే సప్తవర్ణాల సమ్మిళితమైన ఇంద్రధనస్సులా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు.
సప్తవర్ణాల సమ్మిళితంగా న్యాయవ్యవస్థ ఉండాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్
హైదరాబాద్/అడ్డగుట్ట, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ అంటే సప్తవర్ణాల సమ్మిళితమైన ఇంద్రధనస్సులా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని న్యాయవ్యవస్థ ప్రతిబింబించాలని.. ఒకే లింగం లేదా కొన్ని ఆధిపత్య వర్గాలకు మాత్రమే స్థానం ఉండే రోజులు పోవాలని.. ట్రాన్స్‌జెండర్లు కూడా జడ్జిలు అయ్యే రోజులు రావాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ జ్యుడిషియల్ అకాడమీలో జిల్లా జడ్జిల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదస్సులో ‘రాజ్యాంగ నైతికత.. జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. తాను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా ఉన్నప్పుడు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కలిసి ఒక తీర్పు ఇచ్చానని.. అందులో తెలంగాణ నపుంసకుల చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటించానని తెలిపారు. సాంస్కృతిక పక్షపాతం కంటే రాజ్యాంగ నైతికతే గొప్పదని సదరు తీర్పులో పునరుదర్ఘాటించినట్లు వెల్లడించారు. పౌరులకు ప్రత్యక్షంగా సేవలందించే జిల్లా న్యాయవ్యవస్థ మొత్తం న్యాయవ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, సీనియర్ న్యాయమూర్తి మౌషమీ భట్టాచార్య, న్యాయమూర్తులు, జిల్లా జడ్జిల సంఘం అధ్యక్షుడు జీ రాజగోపాల్, కార్యదర్శి కే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాన్ని జస్టిస్ భుయాన్ ఆవిష్కరించారు.