Share News

న్యాయమూర్తుల ఓట్లు పోతే కానీ సమస్య తీరదు

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:25 AM

దేశంలోని సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు తమ ఓటు హక్కు కోల్పోతే కానీ సర్‌ వల్ల ఎదురవుతున్న...

న్యాయమూర్తుల ఓట్లు పోతే కానీ సమస్య తీరదు

  • సర్‌పై సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

  • సుప్రీం ఇచ్చిన తీర్పులో అన్వయలోపం ఉందని వ్యాఖ్య

హైదరాబాద్‌ సిటీ, జూలై4(ఆంధ్రజ్యోతి): దేశంలోని సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు, న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు తమ ఓటు హక్కు కోల్పోతే కానీ సర్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభించదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సర్‌ ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును విమర్శించారు. తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ‘సర్‌ ప్రక్రియ - ఓటు హక్కు పరిరక్షణ, ప్రజల డిమాండ్లు’ అనే అంశంపై జరిగిన సమావేశంలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950,సెక్షన్‌21(3) ప్రకారం ఏదైనా(ఎనీ) నియోజకవర్గంలో లేదా అందులోని వార్డుల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టచ్చు అని ఉంటే, దాన్ని అన్ని(ఆల్‌) నియోజకవర్గాల్లో నిర్వహించవచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పులో తప్పుగా అన్వయించిందని ఆరోపించారు. అదే సెక్షన్‌లో స్పెషల్‌ రివిజన్‌ అని మాత్రమే ఉండగా దానిని స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌గా మా ర్చారని ఆక్షేపించారు. బూత్‌లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో) తనకు దరఖాస్తు ఫారం ఇచ్చారని, ఏ చిన్న పొరపాటు దొర్లినా ఓటు హక్కు పోతుందనే భయంతో ఇంతవరకు ఆ కాగితం నింపలేదని తెలిపారు. ప్రజాస్వామ్యం లో ఓటర్లు పాలకులను ఎన్నుకోవాలి గానీ పాలకులే ఓటర్లను ఎంచుకుంటున్నారా? అనే సందేహం కలుగుతుందన్నారు. సర్‌ ప్రక్రియలోని ప్రమాదాన్ని గుర్తించి రాహుల్‌గాంధీ మాట్లాడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇక, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ సర్‌ను మొదట కేవలం రోహింగ్యాలకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ ఇప్పుడు అది ప్రజలందరినీ ఆందోళనలోకి నెట్టేసిందని పేర్కొన్నారు. విద్యాకమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళీ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణ, అభ్యంతరాలు, పరిశీలన, పరిష్కారాల ప్రక్రియకు గడువు 3నెలలవరకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే సర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆకునూరి మురళి, ప్రొ. పద్మజా షా తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2026 | 05:25 AM