జస్టిస్ చంద్రయ్య కన్నుమూత
ABN , Publish Date - May 17 , 2026 | 05:50 AM
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్, ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. చంద్రయ్య(72) కన్నుమూశారు.
తెలంగాణ మానవహక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా సేవలు
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, మే16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్, ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. చంద్రయ్య(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. జస్టిస్ చంద్రయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రయ్య భౌతికకాయాన్ని సుప్రీం కోర్టు విశ్రాంత జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రీ, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సందర్శించి నివాళి అర్పించారు. జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ మాధవీదేవి, జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ పుల్లా కార్తిక్, విశ్రాంత జస్టిస్ రాధారాణి సహా పలువురు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్యకు నివాళులర్పించారు. అలాగే, అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్, దళిత, బహుజన సంఘాలు సంతాపం తెలిపాయి. కాగా, జస్టిస్ చంద్రయ్య అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆదివారం ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నామని ఆయన కుమారుడు ప్రశాంత్, కుమార్తె లావణ్య తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన చంద్రయ్య.. ఉస్మానియా న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం అభ్యసించారు. రాజనీతి శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ప్రభుత్వ ప్లీడర్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, వివిధ ప్రభుత్వ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా ప్రభుత్వం తరపున పలు కేసుల్లో వాదనలు వినిపించారు. తన మాతృమూర్తి గుండా మార్తమ్మ పేరిట ట్రస్ట్ నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా, హైకోర్టు లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. అడ్మినిస్ట్రేటీవ్ జడ్జిగా పలు జిల్లా కోర్టుల్లో సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2005లో, ఆ తర్వాత ఏడాది న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ చంద్రయ్య 2016 మే9న పదవీ విరమణ చేశారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్మన్‌గా 2019లో బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఆ హోదాలో కొనసాగారు. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు గౌరవాధ్యక్షుడిగానూ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ తొలి అధ్యక్షుడిగానూ పని చేశారు. మానవ హక్కుల ప్రచారోద్యమంలో జస్టిస్ చంద్రయ్య చేసిన కృషికి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.