Share News

జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:01 AM

ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపుతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. జురాల ఎడమ కాల్వ ఆయకట్టు కింద పంటలు సాగు వేసి రెండు నెలలు గడవక ముందే సాగునీరు నిలిపివేయడంతో రైతులు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు

జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
jurala

సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

వనపర్తి/గద్వాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపుతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. జురాల ఎడమ కాల్వ ఆయకట్టు కింద పంటలు సాగు వేసి రెండు నెలలు గడవక ముందే సాగునీరు నిలిపివేయడంతో రైతులు మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆత్మకూరు, అమరచింత మండలాలతో పాటు ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల నుంచి వందలాది మంది రైతులు జూరాల ప్రాజెక్టు ఆనకట్టపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. గద్వాలలో రైతులు ఐదు గంటల పాటు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జమ్మిచేడు స్టేజీ వద్ద కూడా రైతులు ధర్నా నిర్వహించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌మహిళా నేతలు అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు ప్రకటించారు. అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేయగా మహిళా రైతులు ఆయన కాళ్లపై పడి నీళ్లు ఇవ్వండని మొక్కారు. ఆ తర్వాత ఇరిగేషన్‌ ఎస్‌ఈ కేశవరావు ధర్నా వద్దకు వచ్చి ఒకరోజు సమయం ఇస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు నచ్చచెప్పడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు

Updated Date - Sep 22 , 2026 | 06:01 AM