Share News

జూరాలపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:02 AM

జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానదిపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

జూరాలపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌

  • అనువైన స్థలం ఎంపిక చేయండి

  • ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానదిపై బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జూరాలకు ఎగువన బ్రిడ్జి కం బారాజ్‌ నిర్మించాలని ఆదివారం జలసౌధలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అలాగే యుద్ధ ప్రాతిపాదికన జూరాల ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో పూడికను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. జూరాల ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నీరు నిల్వ ఉందని, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 0.5 టీఎంసీల ఊటనీరు వచ్చే అవకాశం ఉందని మంత్రికి అధికారులు వివరించారు. సకాలంలో ఈ నీరు రాకుంటే తాగునీటి అవసరాలకు 0.5 టీఎంసీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. గత ఏడాది కర్ణాటక నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. చివరి దశలో ఉన్న ఆయకట్టు పంటలకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి సాగునీరు సరఫరాకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా పంటల సాగునీటిని సమర్థంగా వినియోగించే బాధ్యతను ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు స్వయంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జలాశయా ల్లో పూడిక తొలగింపునకు చర్యలు చేపట్టాలన్న మంత్రి ఉత్తమ్‌.. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 05:02 AM