జూపల్లి X హరీశ్
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:35 AM
రాష్ట్ర అప్పులకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య గురువారం ప్రారంభమైన సవాళ్ల పర్వం శుక్రవారం కూడా కొనసాగింది.
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు జూపల్లి లేఖ
ప్రెస్ క్లబ్‌లో చర్చకు రావాలంటూ సవాల్
దానిపై సంగారెడ్డిలో స్పందించిన హరీశ్
తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేఖ
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన జూపల్లి
తనది పాలమూరు పౌరుషం.. హరీశ్‌ది పలాయనవాదం అంటూ వ్యాఖ్య
హైదరాబాద్/ సంగారెడ్డి/ బంజారాహిల్స్/ కవాడీగూడ జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అప్పులకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య గురువారం ప్రారంభమైన సవాళ్ల పర్వం శుక్రవారం కూడా కొనసాగింది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పులపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సవివరంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. దీనిపై ‘సాయంత్రం 5 గంటలకు చర్చిద్దాం రమ్మ’టూ సవాల్ విసిరారు. దీనికి హరీశ్‌రావు.. బీఆర్‌ఎస్ హయాంలో అప్పుల గురించి శాసన సభలోనే చెప్పానని, జూపల్లి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలతో జూపల్లికి ఆయన లేఖ కూడా రాశారు. అయినప్పటికీ.. శుక్రవారం ఉదయం చేసిన సవాల్ మేరకు సాయంత్రం 5 గంటలకు జూపల్లి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. చర్చకు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎవరూ రాకపోవడంతో మీడియాను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం మిగిల్చారని ఆరోపించారు. గురువారం ఇదే అంశంపై గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద చర్చకు బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించడం, అక్కడికి వస్తున్న కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల వివరాలను గన్ పార్కు వద్ద మీడియాకు జూపల్లి వివరించారు. శుక్రవారం ఆ వివరాలతో కూడిన లేఖలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు వాట్సాప్ ద్వారా పంపారు. ఆ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల గురించి తాను వెల్లడించిన వివరాలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని, తప్పని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు.
‘‘వారు చెప్పేది అబద్ధం అయితే వారు ఏం చేస్తారో కూడా రాతపూర్వకంగా చెప్పాలి’’ అని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి డిమాండ్ చేశారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు, బకాయిలు అన్నీ కలిపి రూ.8,21,651 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేషన్లు తెచ్చిన అప్పులతో తమకు సంబంధం లేదని బీఆర్‌ఎస్ వాళ్లు చెబుతున్నారు. సంబంధం లేకుంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు చెల్లించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు రైతులతో కట్టిస్తారా? మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులు నీళ్లు తాగుతున్న ప్రజలతో కట్టిస్తారా?’’ అని నిలదీశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. కనీసం మీడియానైనా పిలిచి మాట్లాడాలన్నారు. తాను సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్‌కు వస్తానని.. అక్కడైనా చర్చకు సిద్థమని పేర్కొన్నారు. అప్పులకు సంబంధించి తాను వెల్లడించిన వివరాలు తప్పని రుజువు చేయలేక పోతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించి, బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ రద్దు చేస్తారా? అని నిలదీశారు. తనకు పాలమూరు పౌరుషం ఉండబట్టే తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగానికే రాజీనామా చేసిన వాడిని తానన్నారు. ‘‘పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా, తన్నీరు పౌరుషమా తేల్చుకుందాం’’ అన్నారు. కేటీఆర్, హరీశ్ తీరు.. ‘కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తానన్నాడు’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
దుష్ప్రచారం మానుకోండి..
మంత్రి జూపల్లి లేఖకు, సవాల్‌కు స్పందించిన హరీశ్‌రావు.. గత ప్రభుత్వ అప్పులపై దుష్ప్రచారం మానుకోవాలని ఆయనకు సూచించారు. ‘‘ఎన్నిసార్లు వివరించినా మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యుల తీరు మారదా’’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి వివరిస్తూ శుక్రవారం మంత్రి జూపల్లికి.. హరీశ్ బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు వీడియోలు, అప్పులకు సంబంధించి ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపారు. శుక్రవారం సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు, సర్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో తెలిపానని, ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. జూపల్లి తనకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరు 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారనీ, ఆర్బీఐ లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు అని వెల్లడించారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్నిరకాల అప్పులూ కలిపి రూ.3,47,294 కోట్లనే విషయాన్ని స్వయంగా ప్రకటించారన్నారు. తమ లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు తీసుకున్నదని, ఈ విషయం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జూపల్లికి పాలమూరు పౌరుషం, చీమూనెత్తురు ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హరీశ్ లేఖలో సొల్లు తప్ప ఏం లేదు..
ఉదయం తాను చేసిన సవాల్ మేరకు.. సాయంత్రం 5 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లతో కలిసి సోమాజీ గూడా ప్రెస్ క్లబ్‌కు జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. అయితే, ఆ సమయానికి బీఆర్‌ఎస్ నేతలెవరూ అక్కడికి రాలేదు. దీంతో మీడియాతో మాట్లాడిన జూపల్లి కృష్ణారావు.. హరీశ్‌రావు తనకు రాసిన లేఖలో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల గురించి ప్రస్తావించలేదని, ఆ లేఖలో సొల్లు తప్ప ఏమీ లేదని అన్నారు. దమ్ము, ధైర్యం అంటూ హరీశ్ చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనది పాలమూరు పౌరుషమైతే.. హరీ్‌షరావుది పలాయన వాదమన్నారు. తాను చెప్పిన అప్పుల లెక్కలపై సమాధానం చెప్పాలంటూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు ఆహ్వానిస్తే వారు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా వారు విలువలతో బతికితే మంచిదన్నారు. కాగా, తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి హరీశ్‌రావు సహా 26 మంది బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.