పాలమూరును పట్టించుకోని బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:46 AM
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాటం చెప్పారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు: జూపల్లి
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాటం చెప్పారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, మధుసూధన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేత మాటలను ప్రజలు ఇప్పటికీ నమ్మట్లేదు కాబట్టే ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ ప్రతిష్ఠ ఎందుకు దిగజారిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని హరీశ్‌రావుకు సూచన చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు ఖర్చు చేసింది కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమేనన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై సిరిసిల్ల, సిద్దిపేట నియోజవర్గాల్లో చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్, హరీశ్‌రావులకు మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు.