గొల్లపల్లి రిజర్వాయర్‌కు జీవో ఇచ్చిందే బీఆర్‌ఎస్
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:09 AM
గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జీవో ఇచ్చిందే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, ఇప్పుడెందుకు కట్టొద్దంటున్నారో వారే చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఇప్పుడెందుకు కట్టొద్దంటున్నారో చెప్పాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారు?
చర్చకు రావాలని హరీశ్‌కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జీవో ఇచ్చిందే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, ఇప్పుడెందుకు కట్టొద్దంటున్నారో వారే చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. దీని నిర్మాణాన్ని అడ్డుకుంటామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం 2019 మార్చిలో.. 27 రిజర్వాయర్లను ప్రతిపాదిస్తూ జీవోను సవరించిందని, వాటిల్లో గొల్లపల్లి కూడా ఒకటన్నారు. వారే ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను వారే వద్దనడం.. పాలమూరు ప్రజల్ని వంచించడమేనన్నారు. దేవరకద్ర, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌లతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలోనూ కమీషన్లు, కాసుల కోసమే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టారా అంటూ హరీశ్‌రావును నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులపైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 7 వేల కోట్లు మాత్రమేనన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 8,300 కోట్లవరకు పెట్టాయన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు అంగీకరించిన కేసీఆర్.. తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు రావాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 25 వేల కోట్లే అన్నారు. దీంతో 80 శాతం ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారో హరీశ్‌రావు చెప్పాలన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్ చేసి ప్రజల్ని వంచించారన్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ చేపట్టిన కల్వకుర్తి ప్యాకేజీ 29 పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కారన్నారు. ఆ కేసుల్లో తానూ బాధితుడినేనని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 2018లో తప్ప ఏనాడూ ఎన్నికల్లో గెలవలేదన్నారు. ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి హరీశ్‌రావే కారణమన్నారు. వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరని అన్నారు