విశ్వశాంతికి బుద్ధుడి బోధనలే మార్గం
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:21 AM
విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో విశ్వశాంతికి గౌతమబుద్ధుడి బోధనలు ఎంతైనా అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
తెలంగాణ గడ్డ బౌద్ధ వైభవానికి నిలయం: జూపల్లి
హైదరాబాద్, నాగార్జునసాగర్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో విశ్వశాంతికి గౌతమబుద్ధుడి బోధనలు ఎంతైనా అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ హరిత ప్లాజాలో జరిగిన ‘అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు-2026’కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బౌద్ధ వారసత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి స్థాపనలో, అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడిలో మంత్రి జూపల్లి చూపుతున్న చొరవను గుర్తిస్తు ‘ఇంటర్నేషనల్ ఇంటర్ ఛేంజ్ డెవల్‌పమెంట్ అసోసియేషన్’ ప్రతిష్ఠా త్మక ‘గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్’ అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ వేల ఏళ్లుగా బౌద్ధ వైభవానికి నిలయమని చెప్పారు. కృష్ణా నదీ తీరాన ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని, శూన్యతా సిద్ధాంతాన్ని ప్రవచించి, ఈ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారని కొనియాడారు. జూపల్లికి పురస్కారం అందజేసిన అసోసియేషన్ అధ్యక్షుడు మున్ యోంగ్ జో మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి ఆసరాగా నిలుస్తు, మానవ విలువల కోసం మంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శ్రీలంక బౌద్ధ శాసన మంత్రి ప్రొ. హినిదుమ సునీల్ సేనెవి, వియత్నాం ప్రతినిధి డా. తిచ్ నాత్ తు, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్యతోపాటు 22 దేశాల నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.