న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:21 AM
న్యాయ వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు తీసుకొస్తేనే ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు బలోపేతం అవుతాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ.. తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
మనువాద రాజ్యాంగంగా మార్చే కుట్ర: మహేశ్‌గౌడ్
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సదస్సు
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : న్యాయ వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు తీసుకొస్తేనే ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు బలోపేతం అవుతాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియం(ఎ్‌ఫటీసీసీఐ)లో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ న్యాయ సదస్సులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వం కోల్పోయిన ఉదంతంలో ఏర్పడిన న్యాయ వివాదంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోలేకపోవడంతో జరిగిన అన్యాయాన్ని వక్తలు న్యాయ సంక్షోభంగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చే కుట్రకు తెర లేపారని, గాంధీ, నెహ్రూ వారసత్వాన్ని మరిపించే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటును చోరీ చేశారని, అధికారమే పరమావధిగా మోదీ, అమిత్‌షా తీరు ఉందన్నారు. యువత రాహుల్ గాంధీ మిషన్‌లో చేరి అప్రజాస్వామిక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు.