మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య
ABN , Publish Date - May 09 , 2026 | 06:13 AM
నేపాల్ పనిమనుషులు! ఈ పేరెత్తితేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి! చెప్పిన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ యజమానుల నమ్మకాన్ని చూరగొంటున్న నేపాలీలు అదను చూసి..
మళ్లీ పేట్రేగిన నేపాలీ ముఠా
ఎనిమిది నెలల క్రితం పనిలో చేరిన నేపాల్ మహిళ కల్పన
అర్ధరాత్రి ఇంట్లోకి ఇద్దరు అనుచరుల్ని రప్పించిన వైనం
నోట్లో గుడ్డలు కుక్కి హత్య
ఆ టైంలో ఇంట్లో లేని హతురాలు తనూజ భర్త
భారీగా నగదు, బంగారంతో పరారైన ముగ్గురు నిందితులు
నేరుగా నాంపల్లి స్టేషన్‌కు.. అక్కడి నుంచి రైల్లో ఢిల్లీకి!
నిందితుల కోసం పోలీసుల వేట
జూబ్లీహిల్స్‌లో ఘటన
నేపాలీలతో జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్/సిటీ మే 8 (ఆంధ్రజ్యోతి): నేపాల్ పనిమనుషులు! ఈ పేరెత్తితేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి! చెప్పిన ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ యజమానుల నమ్మకాన్ని చూరగొంటున్న నేపాలీలు అదను చూసి.. ఇంట్లోని మనుషులకు హాని తలపెట్టి, అందినకాడికి దోచుకొని వెళుతున్నారు. ఇలాంటి రెండు ఘటనలకు ఇటీవల సాక్షీభూతంగా నిలిచిన హైదరాబాద్‌లోనే మరో ఘోరం జరిగింది. ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ మహిళ, ఆ ఇంటి యజమాని భార్యను దారుణంగా హత్య చేసింది. జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. హతురాలు విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి! ఈ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. డీజీపీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. గతంలో అక్కడ పనిచేసి మానేసిన నేపాల్ మహిళను ప్రశ్నించిన మీదట ఈ దారుణానికి ఒడిగట్టింది నేపాలీ ముఠా పనేనని తేల్చారు. ఇంట్లో పనిచేస్తున్న కల్పన అనే నేపాల్ మహిళ పథకం ప్రకారం యజమాని లేని సమయం చూసి, తన అనుచరులు ఇద్దరిని పిలిపించుకొని హత్యకు ఒడిగట్టిందని ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు హత్య ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సీపీ సజ్జనార్, విచారణలో మాజీ పనిమనిషి వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని మూడంతస్తుల భవనంలో ఏపీ క్యాడర్‌కు చెందిన డీజీపీ స్ధాయి విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే, ఆయన భార్య తనూజ అలియాస్ సునంద (55), వారి ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు. వినయ్ 2019లో ఉద్యోగ విరమణ చేశారు.
గతంలో ఆ ఇంట్లో మీనా అనే నేపాల్ మహిళ పనిచేసేది. వినయ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో పనిలో సాయంగా ఉండేందుకు తోడుగా మరో మహిళను తెచ్చుకోవాలని మీనాకు తనూజ సూచించారు. దీంతో మీనా.. పుణెలో పనిచేస్తున్న నేపాల్‌కే చెందిన కల్పనను 8నెలల క్రితం రప్పించి.. ఆ ఇంట్లో తనకు తోడుగా పనిలో చేర్పించింది. కొన్నాళ్లకు మీనా ఆ ఇంట్లో పని మానేసింది. వినయ్ గురువారం వ్యక్తిగత పనిమీద బెంగళూరు వెళ్లారు. ఆ రోజు రాత్రి తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన గదిలో నిద్రించారు. ఆమె ఇద్దరు కూతుళ్లు పై అంతస్తుల్లోని గదుల్లో పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత కల్పన.. బయట నుంచి తన అనుచరులు ఇద్దరిని ఇంట్లోకి పిలిపించుకుంది. సీసీ కెమెరాలో కనిపించకుండా ఉండేందుకు పథకం ప్రకారం ఆ ఇద్దరు పార్కు నుంచి ఓ చిన్న గేటు ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. తనూజను బంధించడానికి గుడ్డ పీలికలను వెంట తెచ్చుకున్నారు. అనంతరం ముగ్గురు కలిసి.. తనూజ గదిలోకి వెళ్లారు. అక్కడ గాఢ నిద్రలో ఉన్న తనూజ చేతులు, కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కారు. ఈ ఘటనలో ఊపిరాడకపోవడంతో ఆమె మృతిచెందారు. అనంతరం కల్పన, మరో ఇద్దరు కలిసి ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, డబ్బును మూటగట్టుకొని ఇంట్లోంచి చిన్న గేటు ద్వారా. పార్కులోకి ప్రవేశించి అక్కడి నుంచి పారిపోయారు. పై అంతస్తులో కూతుళ్లు నిద్రలేచి.. వచ్చి చూడటంతో తెల్లవారుజామున ఐదు గంటలకు హత్యోదంతం బయటపడింది. కల్పన గ్యాంగ్ ఆటకట్టించేందుకు పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని బృందాలు పుణెకు, కొన్ని నేపాల్‌కు వెళ్లాయి. కాగా పార్క్ రూట్ నుంచి బయటపడిన దొంగల ముఠా ఓ ఆటోను పట్టుకుని.. మహాప్రస్థానం మీదుగా నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు, అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా నేపాల్ వెళ్లేందుకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలిసింది. ఇప్పటికే విమానాల్లో కొన్ని పోలీసు బృందాలు నేపాల్ చేరుకోగా, మరికొన్ని పోలీసు బృందాలు తెలంగాణ ఎక్స్‌ప్రె్‌సను ఛేజ్ చేస్తూ ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో కల్పన గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్‌లో తనది, కల్పనది సమీప గ్రామాలు అని విచారణలో మాజీ పనిమనిషి మీనా చెప్పింది. కల్పన పనిలో చేరిన కొన్నాళ్లకు తనూజ తనను పిలిచి.. కల్పన సరిగా పనిచేయడం లేదని, గంటలకొద్దీ బయటే ఉంటోందని, మరో పనిమనిషిని చూడాలని చెప్పిందని మీనా వెల్లడించింది.
నేపాల్ పనిమనుషులతో జాగ్రత్త
నేపాల్ పనిమనుషులతో అప్రమత్తంగా ఉండాలని తాను హెచ్చరిస్తూనే ఉన్నానని సీపీ సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్‌లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో నేపాలీలు ఇళ్లలో దోపిడీలకు తెగబడుతున్నారని చెప్పారు. ఏడాది నుంచో, రెండేళ్ల నుంచో ఇళ్లలో నేపాలీలు పనిచేస్తున్నా యజమానులు గుడ్డిగా నమ్మకుండా వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. నేపాలీ ముఠాలు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నెలల తరబడి ఓపిగ్గా వేచిచూస్తాయని, ఇంట్లో మగవాళ్లు లేనపుడు తమ పనికానిచ్చేస్తారని వివరించారు. పనిమనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.
జీబన్ లేదా బహదూర్ ముఠా పనే?
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య, సొత్తు దోపిడీ ఘటనకు నేపాల్‌కు చెందిన జీబన్ ముఠా లేదా బహదూర్ ముఠాతో సంబంధం ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠాలు పథకం ప్రకారం హైదరాబాద్‌లోని ధనవంతుల ఇళ్లలో నేపాలీలను పనికి కుదుర్చుతున్నాయని, అదను చూసి దోపిడీకి పాల్పడేలా ఉసిగొల్పుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ రెండు గ్యాంగ్‌లకు చెందిన ముఠా సభ్యులు బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఉంటూ అక్కడి నుంచే దోపిడీలు చేయిస్తున్నారని చెబుతున్నారు. ఒకసారి దోపిడీ సొత్తుతో దేశ సరిహద్దు దాటి దుండగులు నేపాల్‌లో ప్రవేశిస్తే.. వారిని పట్టుకోవడం అసాధ్యం అవుతుంది. నేపాల్ పోలీసులు దుండగలను అప్పగించడం లేదు. తామే విచారణ చేసి శిక్షిస్తామని చెబుతున్నారు. దోపిడీ సొత్తూ అప్పగించడం లేదు. అయితే తాజా కేసులో దుండగులు నేపాల్‌లో అడుగుపెట్టేలోపే వారిని అరెస్టు చేస్తామని సజ్జనార్ ధీమా వ్యక్తం చేశారు.