Share News

దొంగతనం కోసమే పనిమనిషి ఉద్యోగం!

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:44 AM

జూబ్లీహిల్స్‌లో ఓ ఇంట్లో వంట మనిషే దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నందగిరిహిల్స్‌ రవీంద్రశర్మ అనే వ్యాపారి ఇంట్లో ఈ నెల 5న వంట మనిషి...

దొంగతనం కోసమే పనిమనిషి ఉద్యోగం!

  • ధనవంతుల ఇళ్లలో పని మనుషులుగా చేరి .. దొంగతనం చేయడం కోసం నేపాల్‌ నుంచి వచ్చిన ముగ్గురు

  • ఈ పథక సూత్రధారి జిబన్‌చంద్‌ కూడా నేపాలీనే

  • మధ్యవర్తి ద్వారా జూబ్లీహిల్స్‌ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో వంటమనిషిగా చేరిన భూపేంద్రషాహి

  • యజమాని కుటుంబం ఇంట్లో లేని సమయంలో మిగతా పనిమనుషులకు మత్తుమందు ఇచ్చి దోపిడీ

  • ఇద్దరిని పట్టుకున్న పోలీసులు

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో ఓ ఇంట్లో వంట మనిషే దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నందగిరిహిల్స్‌ రవీంద్రశర్మ అనే వ్యాపారి ఇంట్లో ఈ నెల 5న వంట మనిషి(నేపాలీ) సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి రూ.1.30కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన జిబన్‌చంద్‌ ధనవంతుల ఇళ్లలో దొంగతనం చేయడమే లక్ష్యంగా భూపేంద్రషాహీ, కృష్ణచంద్‌, కుమార్‌ అనే యువకులను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. వారికి పని ఇప్పించాలని కొండాపూర్‌లో నివాసముండే మధ్యవర్తి మదన్‌ను సంప్రదించాడు. రవీంద్రశర్మ ఇంట్లో వంట మనిషి పని ఖాళీగా ఉందని మదన్‌ చెప్పాడు. భూపేంద్రషాహీకి వంట రావడంతో 15 రోజుల క్రితం అతన్ని అక్కడ పనిలో కుదిర్చాడు. జిబన్‌ తరచూ భూపేంద్రను కలిసి యజమాని ఎక్కడ డబ్బు పెడతాడో గమనించమని చెప్పాడు. భూపేంద్ర యయమాని ఇంట్లో తీసిన కొన్ని ఫొటోల ఆధారంగా దొంగతనానికి ప్లాన్‌ సిద్ధం చేశాడు. ఇంతలో తన కుమారుడికి బాగోలేదని కబురు రావడంతో జిబన్‌ నేపాల్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో, నేపాల్‌ నుంచి తెచ్చిన నిద్రమాత్రలు భూపేంద్రకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ నెల 5న యజమాని కుటుంబంతో సహా బయటకు వెళ్లడంతో భూపేంద్ర తన పథకాన్ని అమలు చేశాడు. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి వాచ్‌మెన్‌ను, ఇద్దరు పనిమనుషులను స్పృహ తప్పేలా చేసి వారిని తాళ్లతో బంధించి మిగతా ఇద్దరు స్నేహితులను పిలిచి లాకర్‌ బద్దలు కొట్టి బంగారు, వజ్రాభరణాలను మూట కట్టాడు. మరో అల్మారా తెరిచేందుకు ప్రయత్నించగా యజమాని కోడలు వచ్చిన అలికిడి అయింది. దీంతో ముగ్గురు నిందితులు పారిపోయారు. భూపేంద్ర, కృష్ణచంద్‌ ముందు గేటు గుండా పారిపోగా కుమార్‌ మరో దారిలో వెళ్లిపోయాడు. భూపేంద్ర, కృష్ణచంద్‌లు ముంబైకి చేరుకున్నారు. అక్కడ కిషన్‌సాయి, లలిత్‌ వీరిద్దరికి ఆశ్రయమిచ్చారు. అక్కడే రెండు రోజులు ఉన్న నిందితులు తర్వాత నేపాల్‌కు బయలు దేరారు. అయితే, ఘటనా స్థలంలో దొరికిన ఓ సెల్‌ఫోన్‌ విశ్లేషణ ద్వారా పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా పోలీసులు ముంబైకి వెళ్లగా నిందితులు అప్పటికే అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో పోలీసులు లఖ్‌నవూతో పాటు నేపాల్‌ సరిహద్దులో మాటు వేశారు. ముంబై నుంచి నేపాల్‌ సరిహద్దుకు ట్రైన్‌లో బయల్దేరి వెళ్లిన నిందితులు ముందుజాగ్రత్తగా నాలుగు స్టాప్‌లకు ముందే ఉన్న స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి లారీలో బార్డర్‌ చేరుకున్నారు. అప్పటికే సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్న పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నగలను స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారి జిబన్‌ నేపాల్‌లో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. జిబన్‌ 2021లో సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రూ.80 లక్షల చోరీ కేసులో నిందితుడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

Updated Date - Feb 12 , 2026 | 12:44 AM