Share News

డీటీవో మృతిపై జేటీసీ విచారణ షురూ

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:06 AM

బొగ్గు టిప్పర్‌ ఢీకొనడంతో విధి నిర్వహణలో ఉన్న భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో) మద్దోజు వెంకన్న మృతి చెందిన ఘటనపై...

డీటీవో  మృతిపై జేటీసీ విచారణ షురూ

  • ప్రమాద స్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

  • సాక్షుల విచారణ, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలన

హైదరాబాద్‌/గణపురం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): బొగ్గు టిప్పర్‌ ఢీకొనడంతో విధి నిర్వహణలో ఉన్న భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో) మద్దోజు వెంకన్న మృతి చెందిన ఘటనపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. విచారణాధికారిగా నియమితులైన జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(జేటీసీ) చంద్రశేఖర్‌ గౌడ్‌ బుధవారం భూపాలపల్లిలో పర్యటించి విచారణ జరిపారు. ముందుగా ప్రమాదంపై కేసు దర్యాప్తు జరుపుతున్న ఘణపురం పోలీస్‌స్టేషన్‌లో సీఐ కరుణాకర్‌ రావు, ఎస్సై అశోక్‌తో జేటీసీ సమావేశమై కేసు వివరాలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌, యజమానిని విచారించారు. తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉన్న నలుగురు ప్రత్యక్ష సాక్షుల్ని విచారించడంతోపాటు ప్రమాద దృశ్యాలు రికార్డు అయిన సీసీ కెమెరా ఫుటేజిల్ని జేటీసీ పరిశీలించారు. బొగ్గు లోడింగ్‌ పాయింట్‌ అయిన తాడిచర్లకు వెళ్లి అక్కడ ఓపెన్‌ కాస్ట్‌ ప్రతినిధులతో సమావేశమై ఘటన జరిగినరోజు టిప్పర్‌లో బొగ్గు లోడ్‌ రికార్డులను పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ అనంతరం రెండు రోజుల్లో రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తికి జేటీసీ ప్రాథమిక నివేదిక అందజేయనున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 05:06 AM