Share News

‘సర్‌’ పని ఒత్తిడితో బీఎల్‌వో ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ బూత్‌ స్థాయి అధికారిణి (బీఎల్‌వో) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన..

‘సర్‌’ పని ఒత్తిడితో బీఎల్‌వో ఆత్మహత్యాయత్నం

  • రెండు గ్రామాల బాధ్యతలతో ఆందోళన

  • ఓ అధికారి ఒత్తిడే కారణమని బాధితురాలి భర్త ఆరోపణ

  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

ఎర్రవల్లి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ బూత్‌ స్థాయి అధికారిణి (బీఎల్‌వో) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త శాలిమియ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవల్లి మండలం సాసనూలు గ్రామ అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న షాహీదాబేగం.. ఎస్‌ఐఆర్‌ విధుల్లో భాగంగా బీఎల్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమెకు సాసనూలు గ్రామంతో పాటు అనుబంధ గ్రామమైన దువాసుపల్లిలో కూడా ఎస్‌ఐఆర్‌ పత్రాల పంపిణీ బాధ్యతను అధికారులు అప్పగించారు. ఓ వైపు అంగన్‌వాడీ విధులు, మరోవైపు రెండు గ్రామాల ఓటరు జాబితా సవరణ ప్రకియతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో ఈ నెల 4న పెబ్బెరులోని తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి, అపస్మారక స్థితిలోకి చేరింది. గమనించిన కుటుంబసభ్యులు కర్నూల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అటూ రెవెన్యూ అధికారి ఫోన్‌ రావడం, ఇటు ఐసీడీఎస్‌ అధికారులు పని నివేదిక కోసం గ్రూప్‌ కాల్‌లో ఒత్తిడి చేయడంతో భరించలేకే తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి భర్త ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ తమ దగ్గర ఉన్న ఫోన్‌, సిమ్‌కార్డు వెనక్కి ఇవ్వాలంటూ వేధించారన్నారు. కాగా, ఈ ఆరోపణలను సంబంధిత బూత్‌స్థాయి అధికారి ఖండించారు.

Updated Date - Jul 09 , 2026 | 05:04 AM