అంగనవాడీల్లో కొలువులు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:05 AM
అంగనవాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీపైరాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,100 మంది అంగనవాడీ టీచర్లు, 12,882 మంది ఆయాల నియామకానికి గ్రీనసిగ్నల్ ఇచ్చింది. జిల్లాల వారిగా కలెక్టర్లు నోటిఫికేషన జారీ చేసి నియామకాల
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అంగనవాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీపైరాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,100 మంది అంగనవాడీ టీచర్లు, 12,882 మంది ఆయాల నియామకానికి గ్రీనసిగ్నల్ ఇచ్చింది. జిల్లాల వారిగా కలెక్టర్లు నోటిఫికేషన జారీ చేసి నియామకాల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 62 అంగనవాడీ టీచర్, 234 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా 60 టీచర్ పోస్టుల భర్తీకి కొద్దిరోజుల్లో నోటిఫికేషన జారీ కానున్నది. జిల్లాలో 234 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నా ఇంకా మంజూరు ఉత్తర్వులు రాలేదు.
ఫ ఖాళీల వివరాలు
జిల్లా శిశు సంక్షేమశాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో వారంరోజుల తర్వాతే నోటిఫికేషన జారీ అయ్యే అవకాశాలున్నాయి. జిల్లావ్యాప్తంగా 777 అంంగనవాడీ కేంద్రాలున్నాయి. కరీంనగర్ అర్బన ప్రాజెక్టులో తొమ్మిది టీచర్ పోస్టులు, 38 ఆయా పోస్టులు, కరీంనగర్ రూరల్ పరిధిలో 15 టీచర్ పోస్టులు, 69 ఆయా పోస్టులు, గంగాధర ప్రాజెక్టు పరిధిలో 21 టీచర్ పోస్టులు, 57 ఆయా పోస్టులు, హుజురాబాద్ ప్రాజెక్టు పరిధిలో 17 టీచర్ పోస్టులు, 85 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి అందిన ఆదేశాల మేరకు్లో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులు ఎన్ని మంజూరు చేసింది ఇంకా జిల్లాకు సమాచారం అందలేదు.
ఫ సిబ్బంది లేక ఇబ్బంది..
అంగనవాడీ టీచర్ పోస్టులు, ఆయాల పోస్టులను భర్తీ చేయాలని చాలా కాలంగా ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా వాటి భర్తీకి చర్యలు తీసుకోలేదు. ఆయాలు ఉన్నచోట టీచర్లు లేక, టీచర్లు ఉన్న చోట ఆయాలు లేక పూర్తిస్థాయిలో కేంద్రాలు ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయలేదు. జిల్లాలో 777 అంగనవాడీకేంద్రాలు ఉండగా 128 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ భవనాలలో ఆట స్థలం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల వంటి వసతులు చాలా చోట్ల అందుబాటులో లేవు. జిల్లాలో 42 అంగనవాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదు. ఇప్పటి వరకు ఐదు భవనాలు మాత్రమే నిర్మాణం కాగా, మిగతావాటి పనులు ప్రగతిలో ఉన్నాయి. 62 టీచర్, 249 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.