బీటెక్..రెండేళ్లు ఇక్కడ, రెండేళ్లు లండన్!
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:37 AM
విదేశీ విద్యాసంస్థలతో భాగస్వామ్య కార్యక్రమాల నిర్వహణలో జేఎన్‌టీయూ మరో అడుగు వేసింది. ఇప్పటికే స్వీడన్, జర్మనీలోని ప్రముఖ వర్సిటీలతో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న..
గ్రీన్‌విచ్ వర్సిటీతో ఎంవోయూ కుదుర్చుకున్న జేఎన్‌టీయూ
హైదరాబాద్ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): విదేశీ విద్యాసంస్థలతో భాగస్వామ్య కార్యక్రమాల నిర్వహణలో జేఎన్‌టీయూ మరో అడుగు వేసింది. ఇప్పటికే స్వీడన్, జర్మనీలోని ప్రముఖ వర్సిటీలతో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్న జేఎన్‌టీయూ, తాజాగా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్‌ను లండన్‌లోని ప్రఖ్యాత గ్రీన్‌విచ్ యూనివర్సిటీతో కలిసి నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు గ్రీన్‌విచ్ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సులను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు మొదటి రెండేళ్లు జేఎన్‌టీయూహెచ్ క్యాంప్‌సలో, మిగిలిన రెండేళ్లు గ్రీన్‌విచ్ క్యాంప్‌సలో చదవాల్సి ఉంటుంది. ఈ వర్సిటీ ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్ ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో ప్లేస్‌మెంట్లలో ప్రాధాన్యం ఉంటుంది.