Share News

జేఎన్‌టీయూలో 8 మంది విద్యార్థుల బహిష్కరణ

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:31 AM

జేఎన్‌టీయూలో పరస్పరం భౌతికదాడులకు పాల్పడిన రెండు వర్గాలకు చెందిన 8మంది విద్యార్థులపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. వారందరినీ ఆర్నెల్లపాటు జేఎన్‌టీయూ కాలేజీ, హాస్టళ్ల నుంచి బహిష్కరిస్తూ సోమవారం సర్క్యులర్‌ జారీ చేశారు.

జేఎన్‌టీయూలో 8 మంది విద్యార్థుల బహిష్కరణ

  • ఇటీవల వాలీబాల్‌ కోర్టులో పరస్పర దాడులు

  • క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించం: ప్రిన్సిపల్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూలో పరస్పరం భౌతికదాడులకు పాల్పడిన రెండు వర్గాలకు చెందిన 8మంది విద్యార్థులపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. వారందరినీ ఆర్నెల్లపాటు జేఎన్‌టీయూ కాలేజీ, హాస్టళ్ల నుంచి బహిష్కరిస్తూ సోమవారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఇటీవల వాలీబాల్‌ కోర్టు వద్ద జరిగిన ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అంశాన్ని కళాశాల యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలించేందుకు క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈ నెల 22న కమిటీ తుది నివేదిక సమర్పించడంతో పాటు, క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు మొత్తం 8మంది విద్యార్థులపై వేటు పడింది. వీరిలో ఇద్దరిని ఆరు నెలల పాటు, ఆరుగురిని నెల పాటు కళాశాల నుంచి బహిష్కరించారు. అలాగే ఏడుగురిని హాస్టళ్ల నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు ఐడీపీ (ఈసీఈ, సీఎ్‌సఈ), ఆరుగురు మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అకడమిక్‌ వాతావరణానికి భంగం కలిగించే వారిని క్షమించేదిలేదని ప్రిన్సిపాల్‌ జి.వి.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన వారిని తక్షణం హాస్టళ్ల నుంచి బయటకు పంపాలని వార్డెన్లకు సూచించామన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు వారిని యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 07:32 AM