Share News

ఐదేళ్లలోనే బీటెక్‌, ఎంఎస్‌!

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:46 AM

ఐదేళ్లలోనే బీటెక్‌తో పాటు విదేశీ విద్యాలయాల నుంచి మాస్టర్స్‌ (ఎంఎస్‌) పూర్తిచేసే అవకాశాన్ని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కల్పిస్తోంది.

ఐదేళ్లలోనే బీటెక్‌, ఎంఎస్‌!

  • జేఎన్‌టీయూ విదేశీ కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోనే బీటెక్‌తో పాటు విదేశీ విద్యాలయాల నుంచి మాస్టర్స్‌ (ఎంఎస్‌) పూర్తిచేసే అవకాశాన్ని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ కల్పిస్తోంది. ఈ మేరకు జర్మనీలోని రౌట్లింగన్‌ వర్సిటీతో పాటు స్వీడన్‌లోని బ్లెకింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో ఎంవోయూ కుదుర్చుకున్న జేఎన్‌టీయూ.. ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ అండ్‌ మాస్టర్‌ ప్రోగ్రాం (ఐఐబీఎంపీ), ఇంటిగ్రేటెడ్‌ డబుల్‌ డిగ్రీ మాస్టర్స్‌ ప్రోగ్రాం (ఐడీడీఎంపీ)లలో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీటెక్‌ తరవాత విదేశాల్లో ఎంఎస్‌ చేసేందుకు అయ్యే ఖర్చుతో పోల్చితే తక్కువ వ్యయంతో ఈ డిగ్రీలను పూర్తి చేయవచ్చు. ఆయా కోర్సులు పూర్తిచేసిన వారికి విదేశీ వర్సిటీల నుంచి ఎంఎస్‌ సర్టిఫికెట్‌ ఇస్తుండగా, జేఎన్‌టీయూ బీటెక్‌తో పాటు ఎంటెక్‌ సర్టిఫికెట్‌ కూడా అందిస్తుండడం విశేషం. ఐఐబీఎంపీ ప్రోగ్రాం కింద సీఎస్ఈ, ఈసీఈ కోర్సుల్లో 120 సీట్లు అందుబాటులో ఉండగా, ఐడీడీఎంపీ ప్రోగ్రాంలో నాలుగు కోర్సుల్లో కలిపి 80 సీట్లున్నాయి. 30 శాతం సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లకు, 70శాతం సీట్లను టీజీఎ్‌పసెట్‌ ర్యాంకర్లకు కేటాయించామని, మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఐఐబీఎంపీ కోర్సులో చేరే విద్యార్థులు మూడేళ్లు జేఎన్‌టీయూలో, రెండేళ్లు జర్మనీలో చదవాల్సి ఉంటుంది. జేఎన్‌టీయూలో చదివే మొదటి మూడేళ్ల పాటు సెమిస్టర్‌కు రూ.1.25 లక్షల చొప్పున ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఐడీడీఎంపీ విద్యార్థులు మూడున్నరేళ్ల పాటు జేఎన్‌టీయూలో, ఏడాదిన్నర పాటు స్వీడన్‌లో చదవాలి. ఇక్కడ చదివే మూడున్నరేళ్ల పాటు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడి నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయసు 16 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఇంటర్మీడియట్‌ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి గల వారు జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ బాలునాయక్‌ తెలిపారు.

Updated Date - Jun 27 , 2026 | 06:48 AM