జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడరన్న నమ్మకంతో ఉన్నాం
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:00 AM
కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం తెంచుకోవద్దని, పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్లీ చర్చించుకుందామని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డికి వివరించాం..
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
చిన్న చూపు చూశారనే పార్టీ వీడుతున్నా: జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం తెంచుకోవద్దని, పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్లీ చర్చించుకుందామని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డికి వివరించాం.. ఆయన పార్టీని వీడరన్న నమ్మకంతో వెళ్తున్నాం’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. అసంతృప్తితో ఉండి కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించిన జీవన్‌రెడ్డిని బుజ్జగించడానికి మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి మహేశ్ కుమార్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వచ్చారు. సుమారు అరగంట పాటు జీవన్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్‌రెడ్డికి ఇబ్బందిగా మారాయన్నారు. ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారని తెలిపారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయని, దానిలో భాగంగానే జీవన్‌రెడ్డి కూడా ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెస్‌లో 40 సంవత్సరాల సేవను, గత పదేళ్ల ఒంటరి పోరును అధిష్ఠానం చిన్న చూపు చూసిందని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం దక్కని చోట ఎలా ఉండాలని ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతంలో పీసీసీ పదవి తనకు రాకుండా అడ్డుకున్నా బాధపడలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానన్నారు. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సీఎం పదవి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయన్నారు. తాను ఒంటరిగా మండలిలో పోరాటం చేశానని, తనకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవాలని ఆయన అన్నారు.
దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊర్కోం: మహేశ్ గౌడ్
దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తే చూస్తూ ఊర్కోబోమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.