జీవన్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాం
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:11 AM
మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్లో సముచిత స్థానం కల్పిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గురువారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన...
కేసీఆర్‌తో ఆయన అనుబంధం ఇప్పటిది కాదు.. సాదరంగా బీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానిస్తున్నాం: కేటీఆర్
27 నెలలుగా కాంగ్రెస్‌లో క్షోభ అనుభవించా: జీవన్‌రెడ్డి
జగిత్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్లో సముచిత స్థానం కల్పిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గురువారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్ గంటన్నరపాటు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు జీవన్‌రెడ్డిని సాదరంగా బీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానించామని తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన జీవన్‌రెడ్డి సేవలు బీఆర్‌ఎ్‌సకు అవసరమన్నారు. జీవన్‌రెడ్డి చేరిక బీఆర్‌ఎ్‌సకు అతి పెద్ద బలం కానుందని జోస్యం చెప్పారు. గులాబీ అధినేత కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని వ్యాఖ్యానించారు. గతంలో జీవన్‌రెడ్డి వినతి మేరకు రాయికల్ మండలంలో గోదావరిపై నిర్మించతలపెట్టిన బోర్నపల్లి వంతెన కోసం రూ.75కోట్లు కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. 2014 ఎన్నికలప్పుడే జీవన్‌రెడ్డిని కేసీఆర్ ఆహ్వానించినా.. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారని పేర్కొన్నారు. అదే కాంగ్రె్‌సలో ఇప్పుడు జీవన్‌రెడ్డి లాంటి సీనియర్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార మత్తులో ఉన్నారని, ఆయన భాషపై జనాల్లో చర్చ జరుగుతోందన్నారు. కాగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీఆర్‌ఎ్‌సతో కలిసి పనిచేస్తానని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ఉత్తమమని, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. 27నెలలుగా కాంగ్రెస్‌లో క్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో భావోద్వేగానికి గురయ్యానన్నారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ వంటి నేతతో కలిసి పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్‌ను కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కార్యక్రమంలో గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.