Share News

అన్నా.. నన్ను దేవుడే పంపిండు!

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:00 AM

ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కారెక్కుతున్నారు. ఈనెల 20న గులాబీ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు.

అన్నా.. నన్ను దేవుడే పంపిండు!

  • కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి భావోద్వేగం

  • ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌‌లో ప్రత్యేకంగా భేటీ

  • 20న జగిత్యాలలో సభ.. బీఆర్‌ఎ్‌సలో చేరిక

సిద్దిపేట, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కారెక్కుతున్నారు. ఈనెల 20న గులాబీ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌‌కు వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జీవన్‌రెడ్డి వెంట ఆయన కుమారులు రామకృష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్ర కృష్ణారెడ్డి, జగిత్యాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత, సురేశ్‌ దంపతులు, తదితరులున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ‘అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే ఇక్కడకు పంపాడు’ అని జీవన్‌ రెడ్డి భావోద్వేగంతో అన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసర ం ఎంతో ఉందని, ఈ అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తనకు సమర్ధత ఉంది కాబట్టే కాంగ్రెస్‌ అధిష్టానం 14 సార్లు భీ ఫామ్‌ ఇచ్చిందని జీవన్‌రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా పీసీసీ నడుచుకుంటోందని, దీనివల్ల కాంగ్రెస్‌ ఉనికి కోల్పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ కార్యసాధకుడని, పదేళ్లలో అన్ని వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని జీవన్‌రెడ్డి వాపోయారు. కాంగ్రెస్‌ పోవాలే, కేసీఆర్‌ మళ్లీ రావాలని ప్రజల్లో నినాదం వస్తున్నట్లు వివరించారు. మరోవైపు సుదీర్ఘ సమావేశం తర్వాత కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రజల కోసం కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డితో చెప్పారు. ఈ నెల 20న జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, నియోజకవర్గ ప్రజల సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతానని జీవన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 05:00 AM