Share News

ముఖ్యమంత్రి కూడా నా పరిస్థితికి కారణమే

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:24 AM

‘అవమానాలు భరిస్తూ ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగలేను. 20 నెలలుగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం నా పరిస్థితికి కారణమే..

ముఖ్యమంత్రి కూడా నా పరిస్థితికి కారణమే

  • అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేను: జీవన్‌రెడ్డి

జగిత్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘అవమానాలు భరిస్తూ ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగలేను. 20 నెలలుగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం నా పరిస్థితికి కారణమే.. పార్టీకి ఈనెల 25న రాజీనామా చేస్తా’ అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని అధినాయకత్వానికి సూచించానని, కానీ అమలు చేయడం లేదన్నారు. ఫిరాయింపుదారులే కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘సీఎం రేవంత్‌ వల్ల నా గౌరవానికి భంగం కలిగింది. నాకు సీఎం అంటే గౌరవమున్నా నా సమస్యకు పరిష్కారం ఆయన వద్ద కూడా లేదు. పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టగలరా? నాకు అన్యాయం జరగడంలో ఎమ్మెల్యే సంజయ్‌ పాత్ర ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నా.. మంత్రి పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ నాకు దక్కకున్నా ఓపికతోనే ఉన్నా. ఇక తప్పట్లేదు. ఈనెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అభిమానులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటా’ అని వెల్లడించారు.

Updated Date - Mar 23 , 2026 | 06:25 AM