Share News

కారెక్కనున్న జీవనరెడ్డి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:51 AM

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. కాంగ్రెస్‌ స్టార్‌గా పేరున్న జీవనరెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం కరీంనగర్‌కు వచ్చి ఇక్కడి

కారెక్కనున్న జీవనరెడ్డి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. కాంగ్రెస్‌ స్టార్‌గా పేరున్న జీవనరెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం కరీంనగర్‌కు వచ్చి ఇక్కడి పార్టీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మరికొందరు సీనియర్‌ నేతలతో కలిసి జీవనరెడ్డి ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్‌లో చేరమని ఆహ్వానించనున్నారు. ఈమేరకు కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులకు సమాచారం అందింది. జీవనరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం జరిగిన తిరుగుబాటులో జీవనరెడ్డి నాదేండ్ల భాస్కర్‌రావు వైపు నిలిచారు. ఆయన మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. కొన్ని నెలల తర్వాత ఆ ప్రభుత్వం రద్దయింది. అనంతర పరిణామాల నేపథ్యంలో జీవనరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకపాత్ర నిర్వహించారు. ఢిల్లీ స్థాయిలో అగ్రనేతలతో సత్సంబంధాలు పెంచుకున్నారు.

ఫ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ చేరికతో..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన క్రమంలో జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికను వ్యతిరేకించిన జీవనరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పలు పార్టీ సమావేశాల్లో తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను చేర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. అయినా అధిష్ఠానం నిర్ణయంలో మార్పు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచననను బయటపెట్టారు. దీంతో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మనకుమార్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌ జీవనరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను పార్టీ వీడవద్దని కోరుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన సంతృప్తి చెందక తన నిర్ణయంలో ఏమి మార్పులేదని ప్రకటించి ఆ తర్వాత రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరేది ప్రకటించలేదు. మొదటి నుంచి బీఆర్‌ఎస్‌లోనే చేరుతారని ప్రచారం జరిగింది.

ఫ రెండుసార్లు కేసీఆర్‌పై పోటీ

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌పైన ఆయన 2006, 2008లో రెండుసార్లు కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేశారు. ఆ రెండు సందర్భాల్లోనూ జీవనరెడ్డి ఓడిపోయారు. జీవనరెడ్డి పలుసందర్భాల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను రాజకీయంగా విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్‌ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన పార్టీలోనే చేరాలని నిర్ణయించుకోవడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జీవనరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్‌ఎస్‌పై రెడ్డి సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని కొంత తొలగించుకోవచ్చని, ఆయన విశేష అనుభవాన్ని వినియోగించుకొని ఉమ్మడి జిల్లాలో పూర్వవైభవం పొందాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆర్‌ జీవనరెడ్డిని ఆహ్వానించడానికి జగిత్యాలకు వస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జీవనరెడ్డిని పార్టీలో చేర్చుకున్న తర్వాత ఈనెల 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలోనే నిర్వహించాలని కూడా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈనెల మూడో వారంలోనే జీవనరెడ్డి చేరిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్లీనరీకి సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జీవనరెడ్డి పార్టీలో చేరే సందర్భంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Updated Date - Apr 09 , 2026 | 12:51 AM