జనగామలో 160 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:20 AM
జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కలకలం రేపుతున్నాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 160 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జనగామ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కలకలం రేపుతున్నాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 160 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సాధారణ బదిలీలకు అవకాశం లేకపోవడంతో, వీటిని ‘డిప్యూటేషన్’ పేరుతో నిర్వహించడం గమనార్హం. అయితే ఈ బదిలీల ప్రక్రియలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల సర్వీసు నిండిన వారినే బదిలీ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ, ఆ గడువు తీరని వారిని కూడా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వారిని వదిలేసి, తక్కువ కాలం పనిచేసిన వారిని బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.