Share News

అసెంబ్లీ పొడిగింపా? రాష్ట్రపతి పాలనా?

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:32 AM

జమిలి ఎన్నికలపై ముందుకే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్‌లో జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చెబుతున్నారు.

అసెంబ్లీ పొడిగింపా? రాష్ట్రపతి పాలనా?

  • జమిలితో తెలంగాణలో ఏం జరగనుంది?

  • లోక్‌సభతోపాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

  • 2029 జూన్‌లో జరిగే అవకాశం

  • 2028 డిసెంబరుతో ముగియనున్న తెలంగాణ శాసనసభ కాలపరిమితి

  • పొడిగింపునకు వీలు కల్పించేలా జేపీసీ పరిశీలనలో రాజ్యాంగ సవరణ బిల్లులు

  • మిగిలిన ఆరు నెలలపాటు రాష్ట్రపతిపాలన విధిస్తారంటున్న బీజేపీ నేతలు

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలపై ముందుకే వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్‌లో జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చెబుతున్నారు. మరోవైపు రేవంత్‌ ప్రభుత్వ పదవీకాలం 2028 డిసెంబరులోనే ముగియనుంది. దీంతో ఆ ఆరు నెలలపాటు రాష్ట్రంలో ఏం జరగనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జమిలి ఎన్నికలకు అనుగుణంగా అవసరమైన చోట్ల శాసనసభల కాలపరిమితిని పెంచడమో, తగ్గించడమో చేస్తారని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే దీనికి విరుద్ధంగా.. అసెంబ్లీల కాలపరిమితి ముగిసిన చోట్ల రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం ఆ పార్టీ ఎంపీలతో సమావేశమైన సందర్భంగా జమిలి ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు తెలిసింది. కేంద్రం అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తే.. జమిలి ఎన్నికల్లో మొదటి దశ 2029 జూన్‌ లేదా జూలైలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత మోదీ ప్రభుత్వ పదవీకాలం 2029 జూన్‌తో ముగియనున్న సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలను రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జమిలిగా నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్నందునే నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం తెరలేపినట్లు చెబుతున్నారు. అయితే జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేపడితే వివిధ రాష్ట్రాల నుంచి.. ముఖ్యంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమై ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం గ్రహించిందంటున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకే రాష్ట్రాల వారీగా 50 శాతం మేరకు నియోజకవర్గాల పెంపు సూత్రాన్ని తెరపైకి తెచ్చిందని చెబుతున్నారు.


రాష్ట్రపతి పాలన విధిస్తే..

తెలంగాణ వంటి రాష్ట్రాల శాసనసభల పదవీకాలం జమిలికి ఆరు నెలల ముందే ముగియనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతాయన్నది స్పష్టమవుతోంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ కాలపరిమితిని కూడా పొడిగించాల్సి ఉంది. అందుకు వీలు కలిగించే రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉన్నాయి. జేపీసీ పరిశీలన అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీల కాలపరిమితి ముగిసే రాష్ట్రాల్లో మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ కొత్త వాదనను బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ వంటి బలమైన రాష్ట్రం సహకారం లేకుండా పోతుంది. ఇది ఒక రకంగా తమ పార్టీకి నష్టమేనని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్రపతి పాలనను విపక్షాలు అంగీకరించే ప్రసక్తే ఉండదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Mar 28 , 2026 | 05:32 AM