60 మంది బీసీ ఎమ్మెల్యేలే లక్ష్యం: జాజుల
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:15 AM
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే బీసీ ఉద్యమ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం ..
పెద్దపల్లి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే బీసీ ఉద్యమ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవన్‌లో సోమవారం జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడాలని బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉండి, 136 కులాలు కలిగిన బీసీలు బలహీనవర్గాలు కాదని, ఈ సమాజానికి బలమైన శక్తి అని అన్నారు. ఓటు అనే పదునైన ఆయుధాన్ని ఉపయోగించి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీలిచ్చిన రాజకీయ పార్టీలు ఆ మాట నిలబెట్టుకోలేదని, కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నాయని మండిపడ్డారు. కులాల వారీగా చీలిపోకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో కలిసి బీసీలు ఐక్యంగా పోరాడితేనే సర్దార్ సర్వాయి పాపన్న ఆశించిన సమ సమాజం సాధ్యమవుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.