Share News

Telangana Jagriti: తెలంగాణ సమగ్రాభివృద్థికి బ్లూప్రింట్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:50 AM

తెలంగాణ సమగ్రాభివృద్థి కోసం జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక బ్లూప్రింట్‌ రూపొందించడంలో ఆయా కమిటీలు సమర్థంగా పనిచేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు...

Telangana Jagriti: తెలంగాణ సమగ్రాభివృద్థికి బ్లూప్రింట్‌

  • 30 రంగాలు.. 30 కమిటీలు.. లోతైన అధ్యయనం

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దాం

  • రాజకీయ పార్టీ రాజ్యాంగంపై న్యాయ నిపుణుల కమిటీ

  • జాగృతి శ్రేణులతో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమగ్రాభివృద్థి కోసం జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక బ్లూప్రింట్‌ రూపొందించడంలో ఆయా కమిటీలు సమర్థంగా పనిచేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బుధవారం రాత్రి నిర్వహించిన జూమ్‌ కాన్ఫర్మెన్స్‌లో ఎజెండా కమిటీ సభ్యులతో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు సహా 30 అంశాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీలు వేశామని, కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల 17వరకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రూప్‌సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన స్టీరింగ్‌ కమిటీకి నివేదిక ఇవ్వాలని సూచించారు. స్టీరింగ్‌ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల సమస్యలు, పుష్కర కాల పాలనలో జరిగిన అభివృద్థి, ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనం కోసం జాగృతి 30 కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. విద్య, వైద్యం, నిరుద్యోగం, వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాధికారత, ఉద్యోగ, ఉపాద్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సింగరేణి కార్మికుల సమస్యలపై, గల్ఫ్‌ కార్మికులు, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, యువత సాధికారతపై కమిటీలు వేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు ఉండగా, విద్యావంతులైన మహిళలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. తెలంగాణలో మరో రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నామని, రెండు దశాబ్దాలుగా సాంస్కృతిక, సామాజికరంగాల్లో పనిచేస్తున్న జాగృతి’ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్థమవుతోందన్నారు. స్వీయ రాజకీయశక్తిగా ఎదిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఒక పక్కా రాజకీయ పార్టీకి ఉండాల్సిన నియమ నిబంధనలపై జాగృతి కసరత్తు చేస్తోందని. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల రాజ్యాంగాలను అధ్యయనం చేసేందుకు న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రజాస్వామ్యబద్థమైన, పటిష్టమైన విధివిధానాలను రూపొందించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలు, అన్ని పార్టీల రాజ్యాంగాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న జాగృతి పార్టీ కోసం అత్యంత ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం రూపొందించనున్నట్లు కవిత వెల్లడించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:50 AM