కాంగ్రెస్‌ను గెలిపిద్దాం.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం
ABN , Publish Date - May 24 , 2026 | 05:06 AM
రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సంవిధాన్ బచావో చాలా కీలకమైన అంశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
డీలిమిటేషన్ జరిగి 830 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే 500 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించండి
ప్రస్తుత 543 స్థానాలకే జరిగితే 300 సీట్లలో గెలిపించాలి
రాహుల్ ప్రధాని అయి.. రాజ్యాంగాన్ని రక్షిస్తారు
ఆయన చెప్పిన సంవిధాన్ బచావో కీలక అంశం
కర్ణుడికి కవచకుండలం ఎలాంటిదో.. దేశానికి రాజ్యాంగం అలాంటిది
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సంవిధాన్ బచావో చాలా కీలకమైన అంశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. మహాభారతంలో కర్ణుడికి కవచకుండలం ఎలాగో.. దేశ ప్రజల రక్షణకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అలాంటిదని పేర్కొన్నారు. కర్ణుడికి కవచకుండలం రక్షణగా ఉన్నంత కాలం ఎలాంటి ప్రమాదమూ జరగలేదన్నారు. కర్ణుడు తన కవచ కుండలాన్ని ఎప్పుడైతే దానంగా ఇచ్చేశాడో అప్పటి నుంచే చావు వైపునకు ఆయన ప్రయాణం మొదలైందని చెప్పారు. దేశానికి కవచకుండలంలాంటి రాజ్యాంగాన్ని రక్షించడానికే రాహుల్‌గాంధీ సంవిధాన్ బచావో పేరుతో ప్రజల తరఫున పార్లమెంటులో పోరాటం చేస్తున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుని రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దామని, దేశాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ జరిగి 830 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరిగితే 500 సీట్లలోను, ప్రస్తుత 543 సీట్లలోనే ఎన్నికలు జరిగితే 300 సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గాంధీభవన్‌లో శనివారం మీడి యా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంవిధాన్ బచావో కార్యక్రమం ద్వారా ప్రజలు జాగ్రత్త పడాలంటూ రాహుల్ చెబుతున్నారన్నారు. తొలి ప్రధాని నెహ్రూ.. దేశ ప్రజలకు అసరమైన అన్ని వ్యవస్థలనూ ఏర్పాటు చేశారన్నారు.
ఆయన కుమా ర్తె ఇందిరాగాంధీ.. బ్యాంకులను జాతీయం చేసి.. పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారన్నారు. దేశంలోని ప్రతి పేదకు భూమి, ఇల్లు ఇచ్చారని చెప్పారు. ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక ఐటీకి బీజం వేశారన్నారు. ప్రస్తు తం అందరమూ వాడే మొబైల్ పోన్లూ.. టెక్నాలజీని రాజీవ్‌గాంధీ ప్రోత్సహించడం వల్లనే వచ్చాయ తెలిపారు. యువతకు 18 ఏళ్లకు ఓటుహక్కును కల్పించారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం ఇవన్నీ చేసినప్పుడు బీజేపీ లేదు.. మోదీ కూడా లేడన్నారు. 2014లో ప్రధాని అయిన మోదీ.. 2019 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని గెలిచారని ఆరోపించారు. ఓటు చోరీకి గురవుతోందంటూ రాహుల్ గాంధీ ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ నుంచి 12 లోక్‌సభ స్థానాల్లో, ఏపీలో 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగాలన్నా రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నారు. తాను సంగారెడ్డిలో సీతారాముల కల్యాణం బ్రహ్మాండగా జరిపిస్తానని, కానీ ఆ రాముని పేరుతో మాత్రం ఓట్లు అడగనని తెలిపారు. కాక్రోచ్ ఉద్యమం ఉద్దేశం ఏంటన్నది తనకు తెలియదని, దాని గురించి రాహుల్‌గాంధీ చెబుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు.