Share News

కేటీఆర్‌.. ఇదేనా మీ సంస్కృతి?

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:27 AM

సరూర్‌నగర్‌ సభలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డెత్‌ డిక్లరేషన్‌ అన్నారని..

కేటీఆర్‌.. ఇదేనా మీ సంస్కృతి?

  • తెలంగాణ ఇచ్చిన సోనియా కొడుకు, కూతురి చావు కోరుకుంటావా?

  • మాటిస్తే నిలబెట్టుకునేది రాహుల్‌ కుటుంబం

  • మాటిచ్చి మోసం చేసేది కేసీఆర్‌ కుటుంబం

  • రాహుల్‌ నాయకత్వంలో సీఎం రేవంత్‌ 562 మందికి గ్రూప్‌-1 ఉద్యోగాలిచ్చారు

  • వివిధ శాఖల్లో 70 వేల ఉద్యోగాలిచ్చారు

  • దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌తో చర్చకు సిద్ధమా కేటీఆర్‌?: జగ్గారెడ్డి

సంగారెడ్డిటౌన్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): సరూర్‌నగర్‌ సభలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డెత్‌ డిక్లరేషన్‌ అన్నారని.. అసలు కేటీఆర్‌కు నియత్‌ ఉందా? అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘సోనియాగాంధీ దయతోనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. పదేళ్లు సోనియాగాంధీ దయతో రాజభోగాలు అనుభవించారు కదా? తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు, కూతురు చావు కోరుకుంటావా.. ఇదేనా మీ సంస్కృతి కేటీఆర్‌?’ అని నిప్పులు చెరిగారు. బుక్కెడు బువ్వ పెడితే పది కాలాల పాటు చల్లగా ఉండమని దీవించేది తెలంగాణ సంస్కృతి అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ పిల్లల చావు కోరుకోవడమేనా నీ సంస్కృతి అని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియాగాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చాక కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు స్వయంగా వెళ్లి సోనియా కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా? అని నిలదీశారు. ఇప్పుడేమో వాళ్లపైనే డెత్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నావు.. నీ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు అని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పేపర్‌ లీక్‌ అయిన తర్వాత అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగులకు సమాధానం చెప్పారా? అని ప్రశ్నించారు. ‘రాహుల్‌గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి 562 మందికి గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇచ్చారు.. ఇవేకాక వివిధ శాఖల్లో కలిపి మొత్తం 70 వేల ఉద్యోగాలు ఇచ్చారు’ అని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిది అయితే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్‌ కుటుంబానివని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Updated Date - Jul 20 , 2026 | 03:27 AM