Share News

వీహెచ్‌, కుసుమ కుమార్‌లను రాజ్యసభకు పంపాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:41 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కోరారు...

వీహెచ్‌, కుసుమ కుమార్‌లను రాజ్యసభకు పంపాలి

  • ఖర్గేను కోరిన జగ్గారెడ్డి

  • విధేయతకు పట్టం కట్టాలని వినతి

  • సీనియర్లకు అవకాశమిస్తే క్యాడర్‌కు సానుకూల సందేశం

  • అభ్యర్థుల ఎంపికలో అసమ్మతికి తావులేదు

  • అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ వివరాలను తెలంగాణ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాకు వివరించారు. వీహెచ్‌ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నారని తెలిపారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీకి అత్యంత ఆప్తుడని అన్నారు. వీహెచ్‌ వంటి సీనియర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు క్రమశిక్షణ, విధేయతపై మంచి సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. అలాగే, స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన కుసుమ కుమార్‌.. ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రెస్‌ స్థాయి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఉన్నారని, వీరిద్దరి పేర్లను ఇప్పటికే సీఎం రేవంత్‌, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అసమ్మతి అనే పదానికి తావేలేదని అన్నారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Feb 27 , 2026 | 04:41 AM