ఎక్సైజ్‌శాఖలో బదిలీలపై పునరాలోచన చేయండి
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:22 AM
ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలపై పునరాలోచన చేయాలని శాఖ మంత్రి, ముఖ్యమంత్రిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు.
కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు సొంత జిల్లాల్లో పనిచేయవద్దనే నిబంధన ఎత్తివేయాలి
ఈ నిబంధనతో ఉద్యోగులకు ఇబ్బందులు
పిల్లల చదువులపై ప్రభావం పడుతుంది
మంత్రి జూపల్లి, సీఎం రేవంత్‌లకు మీడియా ముఖంగా విన్నవించిన జగ్గారెడ్డి
జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలపై పునరాలోచన చేయాలని శాఖ మంత్రి, ముఖ్యమంత్రిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు. ‘‘ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల సాధారణ బదిలీలలో భాగంగా ఐదురోజుల క్రితం బదిలీ నిబంధనలను విడుదల చేశారు. ఈ నిబంధనల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు వారి సొంత జిల్లాలలో పనిచేయకూడదని 8(ఎఫ్) క్లాజ్‌ను చేర్చారు. కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో ఇలాంటి నిబంధన విధించడం సరికాదు. ఈ నిబంధన వల్ల సంగారెడ్డి జిల్లాలోని 150 మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు, రాష్ట్రవ్యాప్తంగా 3000 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే హెడ్ కానిస్టేబుళ్లు సైతం ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబాలకు దూరంగా ఉండటంతో పాటు, వారి పిల్లల చదువులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో 8(ఎఫ్) నిబంధనను వెంటనే తొలగించాలి. ఈ విషయంలో పునరాలోచించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం రేవంత్‌లను మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు 150 మంది నా దగ్గరకు వచ్చి వారి సమస్యను విన్నవించారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నాకు వ్విజ్ఞప్తి చేశారు. సమయాభావం, అత్యవసర పరిస్థితి ఉన్నందున వెంటనే ఈ సమస్యను పరిశీలించి నిబంధనను ఎత్తివేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా బదిలీలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎంలను మీడియా ముఖంగా కోరుతున్నాను’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.