కాంగ్రెస్‌లో అడిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటది
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:55 AM
కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అధిష్ఠానాన్ని అడిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుందని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదు.. వినేవాళ్లే ఉండరు
వేం సహా పలువురు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు.. కవితకు క్లీన్‌చిట్.. రాజకీయ ఆటలో భాగమే
దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అధిష్ఠానాన్ని అడిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుందని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మనసులో మాట నిర్భయంగా చెప్పుకునే అవకాశం ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందని, బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదని, ఆ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలను వినేవాళ్లే ఉండరని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలే అయినా.. కాంగ్రెస్, బీజేపీలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగ్గారెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌ల పేర్లు రాజ్యసభకు పరిశీలించాలని కోరానని చెప్పారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మైనార్టీ నేత అజ్మతుల్లా ఖాన్, దళిత సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారు తమను గుర్తించాలని అధిష్ఠానాన్ని అడగడంలో తప్పు లేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానానాల్లో ఒక స్థానంపై స్పష్టత ఉందని జగ్గారెడ్డి తెలిపారు. అయితే మరో స్థానం ఎలా దక్కించుకోవాలన్నది అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చూసుకుంటారని తెలిపారు. అయితే సీఎం, పీసీసీ చీఫ్‌లు తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేరన్నారు. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితకు క్లీన్‌చిట్ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్ గేమ్‌గా జగ్గారెడ్డి అభివర్ణించారు. లిక్కర్ మాఫియా గురించి మాట్లాడింది మొదట బీజేపీనేనని, కానీ.. ఇపుడు క్లీన్‌చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఎంతో దూరదృష్టితో దేశం కోసం సలహాలు ఇస్తున్నారని, కానీ నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది దేశానికే నష్టమని అన్నారు. గతంలో కరోనా గురించి హెచ్చరించారని, కేవలం మోదీ నిర్లక్ష్యంతోనే దేశంలో అంత నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం.. కాలుష్య సమస్యపై హెచ్చరిస్తున్నారని, మళ్లీ మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.