అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసే వాళ్లకు.. పోలీసులంటే భయం పుట్టాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:56 AM
అమ్మాయిల భయాలను ఆసరాగా చేసుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేసే నేరగాళ్లకు భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆ విధంగా పోలీసుల చర్యలు ఉండాలి
బాధితురాలి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలన్న సీఎం నిర్ణయం.. అభినందనీయం
ఆడపిల్లను ట్రాప్ చేసే వారికి సజ్జనార్ చర్యలే కరెక్టు
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అమ్మాయిల భయాలను ఆసరాగా చేసుకుని వారిని బ్లాక్‌మెయిల్ చేసే నేరగాళ్లకు భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనల్లో బాధితురాలి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, సీపీ సజ్జనార్, సీఐడీ అధికారి చారు సిన్హాకు అభినందనలు తెలుపుకుంటున్నానన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న నిర్ణయం.. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక ఆయుధంలా మారనుందన్నారు. కొంతమంది ఆకతాయిలు ఆడపిల్లలతో ఫొటోలు దిగి.. ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదులను బహిర్గతం చేయవద్దని పోలీసులను కోరారు. ఆ సమాచారం బహిర్గతమైతే బాధితులు.. తమ జీవితాలను బలి తీసుకునే ప్రమాదం ఉందని చెప్పారు. ట్రాప్ అయిన అమ్మాయిలు సమస్యల్లో పడకుండా కేసును పరిష్కరించాలని పోలీసులను కోరారు. కాగా, అమ్మాయిల్ని ట్రాప్ చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే నేరగాళ్లపై చర్యలు తీసుకోవడంలో సజ్జనార్ తీరు సరైనదేనని జగ్గారెడ్డి అన్నారు. న్యాయస్థానాలు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వైఎ్‌సఆర్ హయాంలో ఓ అమ్మాయిని సతాయించిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేశారని, బీఆర్‌ఎస్ హయాంలోనూ ఒక ఎన్‌కౌంటర్ జరిగిందని గుర్తు చేశారు. రాజ్యాంగం వేరు.. వ్యక్తిగత అభిప్రాయం వేరని, రాజ్యాంగపరంగా ఎన్‌కౌంటర్లను సమర్థించలేమన్నారు. కానీ, కొన్ని సార్లు అలాంటి భయం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు సీక్రెట్ ఆపరేషన్లు చేపట్టాలని కోరారు.