Share News

మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగ్గారెడ్డి

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:47 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తగలబెట్టడంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు.

మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగ్గారెడ్డి

  • రాహుల్‌ దిష్టిబొమ్మను రాంచందర్‌ దహనం చేయడంపై తీవ్ర నిరసన

  • ప్రజలకు వంట గ్యాస్‌ కరువైందని నిరసన వ్యక్తం చేయడం తప్పా?

  • గ్యాస్‌ సరఫరాలో మోదీ ఫెయిల్‌

  • దేశంలో గ్యాస్‌ దొరక్క హోటళ్లు మూతపడుతున్నాయి: జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తగలబెట్టడంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరికి నిరసనగా శనివారం రాత్రి సంగారెడ్డిలో కొత్త బస్టాండ్‌ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను జగ్గారెడ్డి దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. ఎట్టకేలకు మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో గ్యాస్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటళ్లు, రెస్టారెంట్‌లు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దేశంలో గ్యాస్‌ కొరత తీర్చి దేశ ప్రజల ఇబ్బందులు తొలగించాలని రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారన్నారు. రాహుల్‌ గాంధీ సూచనలను పట్టించుకోకుండా, ఆయన దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశ ప్రజల కోసం నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోలేదని, ఇప్పుడు ఇరాన్‌ యుద్ధం వల్ల దేశంలో గ్యాస్‌ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 06:50 AM