రాహుల్ ప్రధానిగా ఉంటేనే దేశ ప్రజలకు క్షేమం
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:03 AM
రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటేనే దేశ ప్రజలు క్షేమంగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు..
సంగారెడ్డిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రాహుల్ తల్లి, తండ్రి, నానమ్మ, తాత, ముత్తాతలు ఈ దేశం కోసం ఏం చేశారో నేను చెబుతా..
ఈ దేశానికి మోదీ ఏం చేశారో మీరు చెబుతారా?
నెహ్రూ పాలనను బ్రేక్ చేశామని సంబరాలు చేసుకునే హక్కు మీకు లేదు
ఇక్రిశాట్, ఐఐటీ, భెల్, ఓడీఎఫ్, బీడీఎల్‌లాంటి కేంద్ర సంస్థలను సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చింది.. మరి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలి?
దేవుళ్లపైనే కుట్రలు చేస్తున్న బీజేపీ నేతలు :జగ్గారెడ్డి
350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
సంగారెడ్డి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటేనే దేశ ప్రజలు క్షేమంగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ 56వ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. 200 కిలోల కేకును చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి, ఆయన భార్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల కట్ చేశారు. 350 మంది చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రాహుల్ తల్లి, తండ్రి, నానమ్మ, తాత, ముత్తాతలు దేశం కోసం తమ జీవితాలు త్యాగం చేశారని జగ్గారెడ్డి చెప్పారు. నెహ్రూ పాలనను బ్రేక్ చేశామని గొప్పలు చెప్పుకొంటున్న మోదీ.. ఈ 12 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలోనే సంగారెడ్డి జిల్లాకు ఐఐటీ, ఇక్రిశాట్, బీడీఎల్, బీహెచ్‌ఈఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి కేంద్ర సంస్థలు మంజూరయ్యాయన్నారు. బీజేపీ హయాంలో ఒక్కటయినా తెచ్చారా అని ప్రశ్నించారు. దేవుళ్లను ఎవరూ పూజించకుండా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు.