Share News

మీనాక్షి రాజ్యసభ సీటుపై ప్రధాని స్థాయిలో కుట్ర

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:14 AM

అత్యంత నిరాడంబరంగా ఉండే మీనాక్షీ నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేస్తే.. ఆమె నామినేషన్‌ను రద్దు చేయడం కోసం ప్రధాన మంత్రి స్థాయిలో ....

మీనాక్షి రాజ్యసభ సీటుపై ప్రధాని స్థాయిలో కుట్ర

  • ఒక్క సీటు కోసం ఇంత దిగజారడం అవసరమా?.. 12 ఏళ్లలో కుట్రలు, కుతంత్రాలు తప్ప పాలన ఎక్కడ?

  • లేని కేసును చూపించి సీటును బీజేపీ దొంగిలించింది

  • అది బయట పడకూడదనే కోవర్టు డ్రామాలు ఆడుతోంది

  • కాంగ్రెస్‌, తెలంగాణ నేతలపై కావాలనే బురద జల్లుతోంది

  • కాంగ్రెస్‌లో ఎవరైనా కోవర్టులు ఉంటే తోడ్కలు తీస్తాం

  • కానీ.. బీజేపీ ట్రాప్‌లో ఎవరూ పడొద్దు: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘‘అత్యంత నిరాడంబరంగా ఉండే మీనాక్షీ నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా రాహుల్‌గాంధీ ఎంపిక చేస్తే.. ఆమె నామినేషన్‌ను రద్దు చేయడం కోసం ప్రధాన మంత్రి స్థాయిలో కుట్ర చేయడం అవసరమా? ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారడం ఆ బీజేపీకి తగునా?’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో కుట్రలు, కుతంత్రాలే తప్ప ప్రజా పాలన ఎక్కడుందని ప్రశ్నించారు. లేని కేసును చూపించి మీనాక్షి సీటును దొంగతనం చేసిన బీజేపీ.. అది బయటపడకుండా కోవర్టు డ్రామాలు ఆడుతోందన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గలీజ్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో మూడో రాజ్యసభ సీటు కోసం ఎన్నికల కమిషన్‌ను వాడుకుని దిగజారుడు రాజకీయం చేసిందన్నారు. గాంధీ ఐడియాలజీతో పనిచేస్తున్న మీనాక్షికి రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకోవాల్సినంత అవసరం ఉందా? అని నిలదీశారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమో కాదో బీజేపీ నేతలే ఆలోచన చేయాలన్నారు. అధికారం, ఎన్నికల కమిషన్‌నూ అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బీజేపీ కబ్జా చేస్తోందని ఆరోపించారు. ‘‘అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం.. నల్లధనం తెచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అడ్డదారిలో రాజ్యసభ సభ్యత్వాన్ని లాక్కోవడం సరి కాదు’’ అని అన్నారు. ఈ విషయంలో బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌పైన బురద చల్లుతున్న హరీశ్‌రావు.. బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు మామ సంకలో ఉన్న హరీశ్‌.. ఇప్పుడు రోడ్లపై పడ్డాడని ఎద్దేవా చేశారు. సీటు దొంగతనం చేసిన బీజేపీ.. కాంగ్రెస్‌ నేతలే సమాచారం ఇచ్చారంటూ తమపై బురద జల్లుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉంటే వారి తోడ్కలు తీస్తామని, కానీ.. బీజేపీ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని అన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:14 AM