ఎన్డీఎస్ఏ ఏం చెబితే అది చేయడానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధం
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:09 AM
కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎ్‌సఏ) ఏం చెబితే అది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సిద్ధంగా ఉన్నారని..
కాళేశ్వరంతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా కావడానికి కారకులు కేసీఆర్, హరీశ్
వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
అప్పట్లో ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నందునే కేసీఆర్, హరీశ్‌ను కాపాడే పనిలో ఉన్నడు
రక్తం చిందించేంత ధైర్యం హరీశ్‌కు లేదు
హింసకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ ఫ్యామిలీ
హరీశ్ రెచ్చగొట్టే మాటల వల్లే ఉద్యమంలో ఆత్మహత్యలు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 12(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎ్‌సఏ) ఏం చెబితే అది చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి.. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా కావడానికి కారకులైన కేసీఆర్, హరీశ్‌రావులు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే వారు కాళేశ్వరంపైన మాట్లాడాలన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందే ఉంటుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే రాజకీయ సంస్కృతి తమ పార్టీదని పేర్కొన్నారు. రైతుల కోసం రక్తం చిందించేంత ధైర్యం హరీశ్‌రావుకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృత స్థాయిలో ఉన్నప్పుడు యువకుల బలిదానాలు జరిగాయని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. అవి జరిగింది హరీశ్‌రావు రెచ్చగొట్టే పనులు, మాటల వల్లనే కదా అంటూ నిలదీశారు. ఆ సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీశ్ అగ్గిపెట్టె మాత్రం మర్చిపోయాడన్నారు. హరీశ్‌రావుకు ఎవరు నచ్చకుంటే వారు సైకోలైపోతరా? సీఎం రేవంత్‌రెడ్డిని ఏదో ఒకటి అనాలనే లైన్‌ను హరీశ్ రావు తీసుకున్నాడని విమర్శించారు.
హింసకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ ఫ్యామిలీ అని, రెచ్చగొట్టే స్వభావం ఆ కుటుంబానిదన్నారు. కాళేశ్వరం బరాజ్‌లలో నీటి నిల్వకు సంబంధించి ఎన్డీఎ్‌సఏ వద్దకు వెళ్లి అది ఏం చెబితే అది చేద్దామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనపై హరీశ్ రావు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆయన కేసీఆర్‌ను, హరీశ్‌రావులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రైతుల పట్ల ఈటలకు నిజంగా ప్రేమే ఉంటే.. కేసీఆర్, హరీశ్‌లను ఒప్పించి ఎన్డీఎ్‌సఏ అధికారుల వద్దకు తీసుకెళ్లాలని, వెంట తమ మంత్రులూ వస్తారన్నారు. ప్రస్తుతం ఈటల బీజేపీలో కీలకంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
తుంగతుర్తి పంచాయితీపై పోస్టుమార్టం!
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల కమిటీ ఏర్పాటుకు సంబంధించి పంచాయితీపైన పోస్టుమార్టం జరుగుతోందని జగ్గారెడ్డి చెప్పారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదానిపైన కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి అందరి అభిప్రాయాలూ తీసుకుంటున్నామని, సోమవారం నివేదికను సిద్ధం చేసి పార్టీ నాయకత్వానికి ఇస్తామన్నారు. కాంగ్రెస్‌లో పంచాయతీలు సహజమని, అన్ని పార్టీల్లోనూ గొడవలు ఉంటాయని, అయితే ఇతర పార్టీల వారు పార్టీ లోపల మాట్లాడుకుంటే.. తమ పార్టీవారు బయటా మాట్లాడతారని పేర్కొన్నారు. కాగా.. తుంగతుర్తి పంచాయతీపైన ఆదివారం గాంధీభవన్‌లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు, ఇతర నేతల నుంచి జగ్గారెడ్డి అభిప్రాయ సేకరణ జరిపారు.